Pakistan Prime Minister Imran Khan (Photo- facebook)

Islamabad, April 08: సుప్రీంకోర్టు (Supreme court) ఇచ్చిన తీర్పు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అన్నారు. తనపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరి (Khasim Suri) తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఇచ్చిన తీర్పు తనను బాధించిందనీ.. కానీ ఆ తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం ఉదయం 10గంటలకు జాతీయ అసెంబ్లీని (National Assembly) సమావేశపరిచి, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ ఎదుర్కోవాల్సి ఉంది. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు.  ఈ సందర్భంగా భారత్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ అగ్రారాజ్యం భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదని పేర్కొన్నారు. ‘ఇతరుల కంటే భారత్‌ గురించి నాకే ఎక్కువగా తెలుసు. ఏ ‘సూపర్‌ పవర్‌’(Super Power) భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. దానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)భావజాలమే. అదే భారత్‌ను పాకిస్థాన్‌ను వేరుచేసింది’’ అని అన్నారు. పాకిస్థాన్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రతిపక్షాలతో పాటు ఆ దేశ మీడియాపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు బేరసారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సభ్యులను గొర్రెల్లాగా కొనుగోలు చేస్తున్నాయని, ప్రమాదకరమైన గుర్రపుస్వారీ (Horse Trading)చేస్తున్నాయని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

Pakistan Supreme Court: పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ, జాతీయ అసెంబ్లీ రద్దును తప్పుబట్టిన కోర్టు, శనివారం ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌

విదేశీ శక్తులు పాకిస్థాన్‌లో నామమాత్రపు వ్యక్తిని అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్‌లో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, బనానా రిపబ్లిక్‌ ఉన్నచోటా ఇలా బహిరంగంగా జరగదని వ్యాఖ్యానించారు. 22 కోట్ల మన ప్రజలకు ఎవరో బయటి నుంచి ఆర్డర్లు ఇవ్వడం తీవ్ర అవమానకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పతనాన్ని సంబరాలు చేసుకుంటోందంటూ పాక్‌ మీడియాపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.