IPL Auction 2025 Live

Pakistan Decisions on India: పాక్ నిర్ణయాలు- సంఝౌత ఎక్స్ ప్రెస్ శాశ్వతంగా రద్దు, భారత సినిమాలపై నిషేధం, వాణిజ్యం కనిష్ట స్థాయికి తగ్గింపు. ఇంకోసారి ఆలోచించుకోండి అని చురకంటించిన భారత్.

తమ విదేశాంగ మంత్రిని భారత్ కు పంపడాన్ని నిలిపివేసింది. భారతదేశంతో ఇక వాణిజ్య సంబంధాలు కనిష్ట స్థాయికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది...

Flags of India and Pakistan | Representational Image | (Photo Credits: PTI)

భారత్ చేసిన ఏకైక పని- జమ్మూకాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం. దీంతో మైండ్ బ్లాంక్ అయిన పాకిస్థాన్ ఏదో చేయాలనుకొని ఇంకేదేదో చేస్తుంది. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన, దుర్మార్గం, అనైతికం అంటూ పాకిస్థాన్ ప్రభుత్వం, పాక్ మీడియా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై ఎంత గొంతు చించుకుంటున్నా, పాకిస్థాన్ కు మద్ధతుగా ఏ ఒక్క దేశం కిక్కుమనడం లేదు.

దీంతో ఈ అంశాన్ని మరింత పెద్దది చేసి చూపేందుకు భారత్ పై పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంది.

ఇప్పటికే భారత విదేశాంగ మంత్రీని బహిష్కరించింది. తమ విదేశాంగ మంత్రిని భారత్ కు పంపడాన్ని నిలిపివేసింది. భారతదేశంతో ఇక వాణిజ్య సంబంధాలు కనిష్ట స్థాయికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరోసారి పాక్షికంగా తమ గగనతలాన్ని మూసివేసింది. భారత్- పాక్ మధ్య నడిచే సంఝౌత ఎక్స్ ప్రెస్ రైలు శాశ్వతంగా రద్దు, వాఘా బార్డర్ మూసివేసింది. అలాగే పాకిస్థాన్ లో భారత సినిమాలపైనా నిషేధం విధించింది.

అయితే, తమ నిర్ణయాలను పాకిస్థాన్ మరోసారి పున:సమీక్షుంచుకోవాలని భారత్ కోరింది. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కనిష్ట స్థాయికి తగ్గించటం పట్ల భారత్ విచారం వ్యక్తం చేసింది. అయితే అదే సమయంలో పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు దిగడంలో తమకేమి ఆశ్చర్యం లేదని, ఇదంతా ముందే ఊహించినట్లు భారత్ చురకలంటించింది. కేవలం ప్రపంచం దృష్టిని ఆకర్శించడం కోసమే పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని, పాక్ చూపిస్తున్న కారణాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని భారత్ ఒక ప్రకటనలో పేర్కొంది.

పాక్ చర్యల పట్ల భారత్ కు ఏమైనా నష్టమా?

పాకిస్థాన్ చర్యలు భారత్ కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలా చాలా సార్లు చేసింది. ఇప్పటికే తమ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని స్వయానా ఆ దేశ ప్రధానే ఎన్నో సార్లు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్న దేశంగా 'Financial Action Task Force' (అంతర్జాతీయంగా దేశాల మధ్య ఫైనాన్స్ వ్యవహారాలు పర్యవేక్షించే సంస్థ) కూడా పాకిస్థాన్ ను Grey లిస్టులో ఉంచింది. ఇది 'Black' లిస్టులోకి వెళ్లిందంటే ఇక పాకిస్థాన్ కు ఏ దేశం ఆర్థిక సహాయం చేసే సాహసం చేయదు. తన చర్యల వల్ల పాకిస్థానే చాలా సార్లు నష్టపోయింది. గతంలో కూడా భారతీయ సినిమాలను నిషేధించింది. దీంతో అక్కడ సినిమా హాళ్లు మూతపడటం జరిగాయి, అక్కడి ప్రజల డిమాండ్ తో మళ్లీ నిషేధాన్ని ఎత్తివేసింది.

ఇప్పుడు కొంత మేర భారత్ కు నష్టం ఉన్నప్పటికీ, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ కు అదేమంత నష్టం అనిపించుకోదు. ఇప్పుడు పాకిస్థాన్ తీసుకుంటున్న తీవ్రమైన చర్యల వల్ల తామూ ఆర్థికంగా నష్టపోతామని తెలిసినా, కేవలం కాశ్మీర్ అంశాన్ని పెద్దగా చేసి చూపించడం ఒక్కటే పాక్ లక్ష్యంగా కనిపిస్తుంది. కశ్మీర్ పై భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించకపోతే అక్కడి ప్రజల్లో నుంచి, మీడియా నుంచి, పాక్ అనుబంధ 'సంస్థ'ల నుంచి ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి పాకిస్థాన్ కూడా గత్యంతరం లేక అందుకు తగినట్లుగా ప్రతిఘటించాల్సి ఉంటుంది.