Modi Announces Credit of $1 Billion: తూర్పు ఏసియా అభివృద్ధి కోసం భారత్ తరఫున రష్యాకు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.
2001 నాటికే ఫార్ ఈస్ట్ రష్యాలో సఖాలిన్ -1, ONGC క్షేత్రాలలో భారత్ 20% వాటాను కలిగి ఉందని ప్రధాని వివరించారు...
Vladivostok, September 05: తూర్పు ఏసియా ప్రాంత (Far East Asia) అభివృద్ధి కోసం భారత్, రష్యాతో చేయిచేయి కలుపుకొని నదుస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఇందుకోసం రష్యా దేశానికి 1 బిలియన్ డాలర్ల ($1 Billion) రుణాన్ని భారత్ ఇస్తుందని మోదీ ప్రకటించారు. వ్లాదివోస్టాక్‌లో జరిగిన 5వ ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్లీనరీ సెషన్‌లో రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ఏర్పాటూ చేసిన సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ భారత ప్రధాని ఈ ప్రకటనలు చేశారు.
భారత్ మరియు రష్యాల మధ్య స్నేహం కేవలం రాజధాని నగరాల్లో రెండు ప్రభుత్వాల మధ్య లాంఛనంగా నిర్వహించే పరస్పర భేటీలకు మాత్రమే పరిమితం కాదని అంతకుమించి, ఇరుదేశాల ప్రజల గురించి మరియు వ్యాపార సంబంధాల గురించి అని మోదీ వ్యాఖ్యానించారు.
తూర్పు రష్యాతో భారతదేశానికి గల బంధం చాలా కాలం నాటిది. వ్లాదివోస్టాక్‌లో కాన్సులేట్ ప్రారంభించిన మొదటి దేశం భారత్ అని మోదీ వెల్లడించారు. ఇక్కడ అభివృద్ధి కోసం, భారతదేశం 1 బిలియన్ డాలర్లు రుణంగా ఇస్తుంది. తన ఈ ప్రకటన ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన దౌత్య విషయాలలో కొత్త ఒరవడి వస్తుందని మోదీ ఆకాంక్షించారు. తూర్పు రష్యా ప్రాంతంతో భారతదేశం యొక్క పాత్ర పెంచడానికి “యాక్ట్ ఫార్ ఈస్ట్” విధానాన్ని కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో మోదీ ఆవిష్కరించారు.
రష్యలోని చమురు మరియు గ్యాస్ క్షేత్రాలో వాటా తీసుకోవడానికి భారతీయ సంస్థలు ఇప్పటికే 7 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు నరేంద్ర మోదీ తెలిపారు. 2001 నాటికే ఫార్ ఈస్ట్ రష్యాలో సఖాలిన్ -1, ONGC క్షేత్రాలలో భారత్ 20% వాటాను కలిగి ఉందని ప్రధాని వివరించారు.
ఈ పర్యటన సందర్భంగా ఇంధన, మెడికేర్ మరియు నైపుణ్య అభివృద్ధి లాంటి మరెన్నో రంగాలలో రష్యా దేశంతో భారత్ అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఇలా ఒప్పందాలు కుదుర్చుకున్న రంగాలన్నింటిలో తూర్పు ఆసియాకు చెందిన కంపెనీల నుండి భారీ పెట్టుబడులను ఇండియా ఆశిస్తుంది. అంతేకాకుండా తూర్పు ఆసియా దేశాలతో గల సంబంధాలు కూడా మెరుగవుతాయని భారత్ ఆకాంక్షిస్తుంది.