Biden Spoke With Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఫోన్, ఎన్నికల ఫలితాలపై ఏమన్నారంటే?
మోదీకి, ఎన్డీఏకి బైడెన్ శుభాకాంక్షలు తెలిపారని ఓ ప్రకటనలో పేర్కొంది.
New Delhi, June 06: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (Modi) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe biden) ఫోనులో మాట్లాడారని శ్వేతసౌధం తెలిపింది. మోదీకి, ఎన్డీఏకి బైడెన్ శుభాకాంక్షలు తెలిపారని ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా-భారత్ సత్సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో-పసిఫిక్ ప్రాంత శ్రేయస్సు కోసం పూర్తి నిబద్ధతతో పనిచేయాలని ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకున్నారని తెలిపింది. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రాధాన్యతలపై భారత ప్రభుత్వంతో చర్చించడానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ న్యూఢిల్లీ రానున్నారు.
దీనిపై కూడా మోదీ, బైడెన్ చర్చించారు. కాగా, ప్రధాని మోదీకి పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెబుతూ రీట్వీల్ చేశారు. ప్రధానిగా మోదీ ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే పక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నాయి. ఎన్డీయే కూటమికి మొత్తం 293 స్థానాలు దక్కాయి.