Zaporizhzhia Nuclear Power Plant: యుక్రెయిన్ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం
రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌లో(nuclear power plant) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో యుక్రెయిన్ ప్రమాద హెచ్చరికలను జారీచేసింది. అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు ఏర్పడనుందని ఆందోళన వ్యక్తి చేస్తోంది.
Ukraine, March 04: యుక్రెయిన్, రష్యా (Ukraine-Russia) దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా వైమానిక దాడులతో (Air strikes)విరుచుకుపడుతోంది. యుక్రెయిన్ సైన్యం కూడా పుతిన్ సేనను అదే స్థాయిలో తిప్పికొడుతోంది. రష్యా దాడుల్లో ఇప్పటికే అనేక జనావాసాలు ధ్వంసమయ్యాయి. రష్యా దాడితో మరో పెనుప్రమాదం ముంచుకోస్తోంది. రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌లో(nuclear power plant) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో యుక్రెయిన్ ప్రమాద హెచ్చరికలను జారీచేసింది. అణు విద్యుత్ ప్లాంట్ భద్రతకు ముప్పు ఏర్పడనుందని ఆందోళన వ్యక్తి చేస్తోంది. యుక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ (Zaporizhzhia nuclear power plant) ఐరోపాలోనే అతిపెద్దది.. రష్యా దళాల దాడి తర్వాత శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని సమీప నగర మేయర్ ఎనర్‌గోదర్ తెలిపారు. యుక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విటర్‌లో ఈ ఘటనకు సంబంధించి పోస్టును పెట్టారు. అణు పవర్ ప్లాంట్‌పై దాడులను వెంటనే నిలిపివేయాలని, భద్రతా జోన్‌ను ఏర్పాటు చేయడానికి అనుమతించాలని ఆయన రష్యా సైన్యాన్ని కోరారు. యుక్రేనియన్ నగరమైన ఎనర్‌హోదర్‌లోని జాపోరిజ్జియా పవర్ ప్లాంట్ 1984, 1995 మధ్య నిర్మించారు. ఆరు సోవియట్ డిజైన్లతో రూపొందించిన 950-మెగావాట్ రియాక్టర్‌లకు నిలయంగా మారింది. దేశంలో ఉత్పత్తి అయ్యే అణు విద్యుత్ మొత్తంలో 20శాతం వాటాను కలిగి ఉంది.
రష్యా బలగాలు జరిపిన దాడుల ఫలితంగా జపోరిజ్జియా అణు ప్లాంట్ అగ్నిప్రమాదానికి గురైందంటూ యుక్రెయిన్ అధికారి ఒకరు వీడియోను పోస్టు చేశారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్లాంట్‌కు చేరుకోవడం కష్టంగా మారిందని పోస్ట్‌లో పేర్కొన్నారు. అణు పవర్ ప్లాంట్‌కు పరిస్థితిపై ప్లాంట్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.
రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం మరోమారు ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. రష్యా, యుక్రేనియన్ ప్రతినిధులు పోలిష్-బెలారసియన్ సరిహద్దులో బ్రెస్ట్‌లో రెండవ రౌండ్ చర్చలకు సమావేశమయ్యారు. యుక్రెయిన్ మానవతా కారిడార్‌ను ప్రారంభించాలని కోరింది.
అయితే ఈ చర్చలలో మాస్కో, యుక్రెయిన్ తమ డిమాండ్లను వినిపించాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం ముగింపునకు ప్రత్యక్ష చర్యలు ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. యుక్రెయిన్‌పై రష్యా దాడితో ఇప్పటికే 227 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.