Twitter Bans Political Campaigns: రాజకీయ ప్రచారాలను బ్యాన్ చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఎటువంటి యాడ్స్ కనపడవు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నిర్ణయం, వెల్లడించిన ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది.
New Delhi, November 1: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ట్విట్టర్ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్ శక్తిమంతమైన వేదికైనప్పటికీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఎన్నో సమస్యలున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ చెప్పారు.
ఈ నిషేధం నవంబరు 22 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15న వెల్లడిస్తామని ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫేక్‌న్యూస్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే అన్ని రాజకీయ ప్రకటనలను తన వేదిక నుండి నిషేధిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప కొనకూడదు" అని ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే ట్వీట్ చేశారు.
జాక్ డోర్సే ట్వీట్
మరోవైపు ట్విటర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల డెమొక్రాట్ల ప్రశంసంలందుకోగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ అపహాస్యం చేయడం ఆశ్చర్యపరిచే విషయం. అయితే ఇండియాలో దీని మీద ఇంకా ఎటువంటి స్పందనలు రాలేదు. సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలకు ఇది నిజంగా మింగుడు పడని చర్యగా చెప్పవచ్చు.