Typhoon Bebinca: గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్‌తో చైనా విలవిల, ఆర్థిక నగరం షాంఘై అస్తవ్యస్తం, రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ప్రమాదకర టైఫూన్ తీరాన్ని దాటింది. బెబింకా కేటగిరీ-1 తుఫాను కావడంతో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసాయి.
Shanghai, Sep 17: గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్ చైనాను తాకింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ప్రమాదకర టైఫూన్ తీరాన్ని దాటింది. బెబింకా కేటగిరీ-1 తుఫాను కావడంతో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసాయి. ఇక, గత 75 ఏళ్లలో ఇంత ప్రమాదకరమైన తుపాను చైనాను తాకలేదు. ఈ తరహా శక్తివంతమైన తుపాన్ 1949లో వచ్చింది.తుపాన్ కారణంగా చైనా వాతావరణ శాఖ షాంఘైలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
దాదాపు 2.5 కోట్ల జనాభా కలిగిన షాంఘై నగర జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇక్కడి జాతీయ రహదారుల్ని మూసేయించారు. షాంఘైలో రెండు విమానాశ్రాయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలన్నీ రద్దయ్యాయి. విమాన ప్రయాణికులకు తాత్కాలిక బస ఏర్పాటుచేసినట్టు అధికారులు ప్రకటించారు. ఆది, సోమ రెండు రోజులపాటు షాంఘై రైల్వే స్టేషన్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది.
తూర్పు చైనాలోని అహూయి ప్రావిన్స్‌కు లెవల్-4 స్థాయి, షాంఘై, ఝిజియాంగ్ నగరాలకు లెవల్-3 ప్రమాద హెచ్చరికలు జారీచేసినట్టు ‘జిన్హువా’ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో 4,14,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Here's Videos
బెబింకా తుపాన్ తీరాన్ని తాకినప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాన్ కారణంగా జన జీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది.తుపాను ప్రభావంతో షాంఘైలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా షాంఘై, జెజియాంగ్, జినుహా నగరాల్లో లెవెల్-3 హెచ్చరిక జారీ చేయగా అను ప్రావిన్సులో లెవెల్-4 హెచ్చరిక జారీ చేశారు.
తుపాను దెబ్బకు షాంఘై నగరంలోని రెండు ఎయిర్‌పోర్టుల నుంచి ఆదివారం సాయంత్రం నుంచి 1400 విమానాలు రద్దయ్యాయి. నగరం నుంచి బయల్దేరాల్సిన 570 ప్యాసింజర్ రైళ్లను క్యాంసిల్ చేశారు. కాగా, సోమవారం సాయంత్రానికి వర్షాలు, గాలులు తీవ్రమవుతాయని చైనా వాతావరణ కేంద్రం తెలిపింది.రెస్క్యూ చర్యల నిమిత్తం సహాయక సిబ్బందిని భారీగా మోహరించింది. అత్యవసర సమయంలో ప్రజలు ఉండటానికి సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. షాంఘై నుంచి దూరంగా ఉన్న అన్ని నౌకలు ఓడరేవుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.