Who is Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్, అదే జరిగితే బ్రిటన్ ప్రధాని అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు, బోరిస్ జాన్సన్ వైఫల్యాలు ఇవే..
బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా రిషి సునక్ పేరు (Who is Rishi Sunak) వినిపిస్తోంది. నూతన ప్రధాని రేసులో రక్షణశాఖ మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్‌తో పాటు రిషి సునక్ తమ ఫేవరేట్ (next UK PM) అని అక్కడి వారు చెబుతున్నారు.
London, July 7: మంత్రివర్గ సహచరులు, కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల తిరుగుబాటుతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి నుంచి కూడా తప్పుకున్నారు. మంత్రుల వ్యతిరేకతతో ఆయన ఈ రెండింటికి రాజీనామా (Boris Johnson Resigns) చేశారు. అక్టోబర్‌లో జరిగే భేటీలో కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. నూతన కన్జర్వేటివ్ నేత ఎన్నికయ్యే వరకూ బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగుతారని యుకె కార్యాలయం తెలిపింది.
ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా రిషి సునక్ పేరు (Who is Rishi Sunak) వినిపిస్తోంది. నూతన ప్రధాని రేసులో రక్షణశాఖ మాజీ మంత్రి పెన్నీ మోర్డాంట్‌తో పాటు రిషి సునక్ తమ ఫేవరేట్ (next UK PM) అని అక్కడి వారు చెబుతున్నారు. అయినా రిషి సునక్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన భారత సంతతి వ్యక్తిగా (Indian-origin Rishi ) చెప్పవచ్చు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తిని వివాహమాడారు. 42 ఏళ్ల రిషి సునక్ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీల నుంచి డిగ్రీలు అందుకున్నారు. 2020లో బ్రిటన్ క్యాబినెట్ లో ఎంతో కీలకమైన ఆర్థికమంత్రి పదవిని చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
రిషి సునక్ ను బోరిస్ జాన్సన్ ఏరికోరి క్యాబినెట్ లోకి తీసుకువచ్చారు. జాన్సన్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆర్థికశాఖను సమర్థంగా నిర్వర్తించారు. ఇటీవల కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు నష్టపోకుండా ఆయన తీసుకువచ్చిన వందల కోట్ల పౌండ్ల ప్యాకేజి సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అయితే, ఇటీవల బోరిస్ జాన్సన్ చర్యలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రిషి సునక్ కొన్నిరోజుల కిందటే ఛాన్సలర్ పదవికి రాజీనామా చేశారు.
సునక్ బాటలోనే పలువురు క్యాబినెట్ సహచరులు కూడా నడవడంతో బోరిస్ జాన్సన్ పై ఒత్తిడి అధికమైంది. మొత్తం 54 మంది వరకు మంత్రులు క్యాబినెట్ ను వీడారు. వీరందరూ కూడా రిషి సునక్ నాయకత్వానికి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లోనూ ఆయనపై సానుకూలత ఉంది. అన్నీ కుదిరితే అక్టోబరు నుంచి రిషి సునక్ ను ప్రధాని పీఠంపై చూడొచ్చు. అదే జరిగితే బ్రిటన్ ప్రధాని అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు.
కాగా, రిషి సునక్ కు ఒకే ఒక్క ప్రతికూలత కనిపిస్తోంది. ఇటీవల ఆయన అర్ధాంగి అక్షత మూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. అక్షత భారత్ కు చెందిన మహిళ కావడంతో ఆమె నాన్ డొమిసైల్ హోదాలో బ్రిటన్ లో ఉంటున్నారు. ఆమెకు భారత పౌరసత్వం మాత్రమే ఉండడంతో బ్రిటన్ లో నాన్ డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. నాన్ డొమిసైల్ హోదా ఉన్న వారు విదేశీ గడ్డపై సంపాదించే సొమ్ముకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని వాడుకుని అక్షత మూర్తి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని బ్రిటన్ విపక్షాలు దుమారం రేపాయి. అందుకు అక్షత మూర్తి బదులిస్తూ, తాను బ్రిటన్ లో చట్టప్రకారం చేస్తున్న వ్యాపారాలకు పన్నులు చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు. అక్షతపై ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేని రిషి సునక్ వర్గం ఎదురుదాడికి దిగింది.
అయితే రిషిపై కొన్ని వివాదాలు కూడా ఉండటం ఆయనకు కాస్త మైనస్‌గా మారే అవకాశం ఉంది. డౌన్‌స్ట్రీట్‌లో సమావేశానికి హాజరై కోడివ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు. తన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి. సునక్ రాజీనామా చేస్తూ.. తాము ఎన్నుకున్న ప్రభుత్వం సమర్థంగా, నమ్మకంగా పనిచేయాలని కోరుకోవడం ప్రజల హక్కు. అయితే, అలా జరుగడంలేదు. ప్రభుత్వాన్ని వీడటం బాధగా ఉంది. అయితే భిన్నమైన మనస్తత్వాలు ఉన్నప్పుడు కలిసి కొనసాగలేము’ అని పేర్కొన్నారు.
బోరిస్ జాన్సన్ వివాదాలు ఇవే.
బ్రిటన్ ప్రధాని పదవికి, కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన అనంతరం జాన్సన్ ఉద్వేగంగా మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరూ అనివార్యం కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాను విజయవంతం కానందుకు చింతిస్తున్నానని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగాన్ని వదులుకుంటున్నందుకు బాధగా ఉందన్నారు. కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడు అవసరం అని వ్యాఖ్యానించిన జాన్సన్.. కొత్త ప్రధాని కూడా అవసరమని చెప్పారు. కొత్త నాయకుడికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని జాన్సన్ స్పష్టం చేశారు. ఇక ఉక్రెయిన్‌కు తమ మద్దుతు ఇస్తూనే ఉంటామని బోరిస్ పేర్కొన్నారు.
మొదటి వివాదం: గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్టాఫర్ పింఛర్‌కు డిప్యూటీ చీఫ్ విప్ పదవి కట్టబెట్టడం బొరిస్ జాన్సన్ ప్రభుత్వంలో అగ్గిరాజేసింది. దీన్ని నిరసిస్తూ ప్రభుత్వం నుంచి మంత్రులు సహా చట్టసభ సభ్యులు వరుసగా వైదొలగడం కలకలం రేపింది. ఓ పార్టీలో మద్యం సేవించి అనుచిత ప్రవర్తనతో ఇతరులకు అసౌకర్యం కలిగించాడనే ఆరోపణలపై పింఛర్‌ను గతవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 2019లో పింఛర్ లైంగిక దుష్ర్పవర్తన వ్యవహారం తమకు తెలియదని జాన్సన్ కార్యాలయం తెలిపింది. అయితే ప్రధాని అసత్యం చెబుతున్నారని 2015 నుంచి 2020 వరకూ బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో సీనియర్ అధికారిగా పనిచేసిన సైమన్ మెక్ డొనాల్డ్ ఆరోపించడం కలకలం రేపింది.
రెండవ వివాదం: కొవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం సహా ప్రభుత్వంలో పార్టీలు, విందులు జరిగాయనే పార్టీగేట్ స్కాండల్ బోరిస్ జాన్సన్ సర్కార్‌కు చికాకులు తెచ్చిపెట్టింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఓ బర్త్‌డే పార్టీకి హాజరైనందుకు ఏకంగా జాన్సన్‌కు పోలీసులు ఫైన్ విధించడం కూడా కలకలం రేపింది.
మూడవ వివాదం: కన్జర్వేటివ్ సభ్యులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా జాన్సన్ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చాయి. ఈ ఆరోపణలపై ఇద్దరు చట్టసభ సభ్యులు రాజీనామా చేయగా వారి స్ధానాలను భర్తీ చేసేందుకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్‌లకు ఓటమి ఎదురైంది. 15 ఏండ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో కన్జర్వేటివ్ ఎంపీ ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ రాజీనామా చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అశ్లీల వీడియోలు చూసినందుకు మరో కన్జర్వేటివ్ సభ్యుడు నీల్ పరిష్ రాజీనామా చేశారు. లైంగిక దాడి, వేధింపుల కేసులో మరో కన్జర్వేటివ్ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నాలుగవ వివాదం : తనకు ముడుపులు చెల్లించిన కంపెనీలకు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్న కన్జర్వేటివ్ సభ్యుడు, మాజీ మంత్రి ఓయెన్ ప్యాటర్సన్‌ను 30 రోజులు సస్పెండ్ చేయాలని గత ఏడాది పార్లమెంట్ స్టాండర్డ్స్ కమిటీ సిఫార్సు చేసింది.
ఐదవ వివాదం: సెలబ్రిటీ డిజైనర్ నేతృత్వంలో జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్ పునరుద్ధరణ విషయంలో దాని చెల్లింపులకు వచ్చిన విరాళాలపై సరైన నివేదిక ఇవ్వడంలో విఫలమైనందుకు బ్రిటన్ ఎన్నికల కమిషన్ కన్జర్వేటివ్‌లపై 17800 పౌండ్ల జరిమానా విధించింది. ఇది కూడా పలు వివాదాలకు కేంద్ర బిందువు అయింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)