Ram Charan: మీ లోటు పూడ్చలేం, మృతుల కుటుంబాలకు రూ. 2.5 లక్షల సాయం ప్రకటించిన రాంచరణ్, రూ. 2 లక్షల సాయం ప్రకటించిన జనసేనాధినేత పవన్ కళ్యాణ్
వారి లేని లోటును మనం పూడ్చలేమని రాంచరణ్ అన్నాడు. ముగ్గురి కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ చిత్తూరు జిల్లాలో ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతంతో ప్రాణాలు (Three Pawan Fans Electrocuted) కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సినీహీరో రాంచరణ్ (Ram Charan) , అల్లు అర్జున్ (Allu Arjun) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారనే వార్త కలచి వేసిందని చెప్పారు. మీ ప్రాణాల కంటే ఏదీ ముఖ్యమైనది కాదని అన్నారు. అభిమానులంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని... మీ కుటుంబ సభ్యులకు ఆవేదన కలిగించవద్దని కోరారు.
దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.ఈ బాధాకర సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడం తప్ప మనం మరేమీ చేయలేమని... వారి లేని లోటును మనం పూడ్చలేమని రాంచరణ్ అన్నాడు. ముగ్గురి కుటుంబాలకు రూ. 2.5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు.
Ram Charan Tweets
Allu Arjun Tweet
ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరులో పవన్ బర్త్‌డేకు బ్యానర్ కడుతూ ముగ్గురు మరణించడం గుండెను కలిచివేసిందన్నారు. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు.. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ కుటుంబానికి మీరే సర్వస్వం అన్న విషయం మర్చిపోవద్దని కోరారు. పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల ఏర్పాట్లలో ఆయన ముగ్గురు అభిమానులు మరణించడం విషాదకరమని హీరో వరుణ్ తేజ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దయచేసి అందరూ ఎల్లవేళలా కనీస జాగ్రత్తలు పాటించండని కోరారు. పవన్ పుట్టిన రోజు వేడుకల్లో ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం
ఇది మాటలకు అందని విషాదమని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ తల్లిదండ్రుల గర్భశోకాన్ని అర్థం చేసుకోగలను.. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక వారికి తానే ఓ బిడ్డగా నిలుస్తానని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ ఆదేశించారు. అలాగే మరో నలుగురు హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యం, అరుణ్ చికిత్స పొందుతున్నారని, వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులను ఆదేశించారు. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థించారు.