Superstar Krishna Funeral: ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి, దహన సంస్కారాలు నిర్వహించిన కుమారుడు మహేష్ బాబు, అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో (Superstar Krishna funeral) ముగిసింది.
అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో (Superstar Krishna funeral) ముగిసింది. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. కృష్ణకు కుమారుడు మహేశ్‌బాబు దహన సంస్కారాలు (Mahesh Babu performs last rites) నిర్వహించాడు.
నటశేఖరుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణకు అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవదేహానికి అభిమానులు, ప్రజలు, సినీ ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం.. మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులతోపాటు అభిమానులు భారీ ఎత్తున అంతిమయాత్రకు తరలివచ్చారు.పద్మాలయ స్టూడియో ప్రాంగణం అంతా జనాలతో కిక్కిరిసి పోయింది.
తమ అభిమాన నటుడిని కడాసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లు తోసుకుని అభిమానులు ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. దీంతో జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగారు.