Costumes Krishna Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత.. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో మృతి
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు.
Hyderabad, April 2: టాలీవుడ్ (Tollywood) లో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ (Costumes Krishna) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నై ఆసుపత్రిలో (Chennai Hospital) ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు తెలిపారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఆయన పరిచయమయ్యారు. ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత విలన్, సహాయ పాత్రల్లో నటించారు. పెళ్లి పందిరి సహా 8 చిత్రాలకు నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు. కాస్ట్యూమ్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపుకోట. సినిమాలపై ఇష్టంతో 1954 లో మద్రాస్ వెళ్ళి, అక్కడ సినిమా వాళ్ళ దగ్గర అసిస్టెంట్ కాస్ట్యూమర్ గా కృష్ణ జాయిన్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న ఈయన, ఆ తర్వాత రామానాయుడు సంస్థలో ఫుల్ టైమ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి హీరోల నుంచి వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్స్ వరకూ చాలా మందికి కాస్ట్యూమ్స్ అందించారు.
ట్రెండ్ సెట్ చేశారు
నాటి ట్రెండ్ కి తగ్గట్టు హీరోలకి బెల్ బాటం నుంచి బ్యాగీ ప్యాంట్టు వరకూ చాలా రకాల మోడల్ దుస్తులను హీరోలకి అందించేవారు.అప్పట్లో అవి ఒక ట్రెండ్ సెట్ చేశాయి. చాలా ఏళ్ళు ఆ ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. ఇక ఈయన ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ పనిచేస్తూ ఉండేవారు.ఎప్పుడూ ఖాళీ లేనంత, కనీసం కుటుంబంతో గడిపేంత సమయం కూడా లేనంత బిజీగా ఉండేవారు.ఈ కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కేది.
ఆ సినిమాతో కీలక మలుపు
అయితే కాస్ట్యూమ్ డిజైనర్ గా బిజీగా ఉన్న కృష్ణలో, దర్శకుడు కోడిరామకృష్ణ నటుడ్ని చూశారు. ఆయన ఆకారం, బాడీలాంగ్వేజ్ చూసి ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉందని, గొప్ప నటుడయ్యే అవకాశాలు ఉన్నాయని కోడిరామకృష్ణ, కాస్ట్యూమ్స్ కృష్ణని సినిమాల్లో నటించమని అడిగారట. అలా భారత్ బంద్ సినిమాలో విలన్ గా నటించారు. మొదటి చిత్రంతోనే నటుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు.నటుడిగా సక్సెస్ అయిన కాస్ట్యూమ్స్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అశ్వద్దామ సినిమాని నిర్మించారు.అది హిట్ అవ్వడంతో కోడి రామకృష్ణ డైరెక్టర్ గా పెళ్ళాం చెపితే వినాలి, మా ఊరు మారదు, పుట్టింటికి రా చెల్లి, పెళ్లి పందిరి వంటి బ్లాక్ బస్టర్స్ ని తీశారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన చెన్నైలో ఓ అపార్ట్ మెంట్ లో సాధారణ జీవితం గడుపుతున్నారు.