Unified Pension Scheme: 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్.. కేంద్రం నుంచి కొత్త పెన్షన్ విధానం.. 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
పదవీ విరమణ అనంతరం రిటర్డ్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగేలా ఏకీకృత పింఛన్ పథకాన్ని (యూపీఎస్) కేంద్రం తీసుకొచ్చింది.
Newdelhi, Aug 25: సర్కారీ ఉద్యోగులకు (Central Government Employees) కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ అనంతరం రిటర్డ్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగేలా ఏకీకృత పింఛన్ పథకాన్ని (యూపీఎస్) (Unified Pension Scheme-UPS) కేంద్రం తీసుకొచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం అమల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జాతీయ పింఛన్ పథకం (ఎన్‌పీఎస్) అమల్లో ఉండగా దాని నుంచి యూపీఎస్ కు మారేందుకు అవకాశం కల్పిస్తారు. యూపీఎస్ స్కీంతో దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. అదే జరిగితే లబ్ధి పొందే ఉద్యోగుల సంఖ్య 90 లక్షలకు పెరుగుతుంది.
పెన్షన్ ఇలా..
యూపీఎస్ విధానం వల్ల 25 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ లభిస్తుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. అయితే, కనీస పెన్షన్ రావాలంటే మాత్రం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. యూపీఎస్ విధానంలో ఉద్యోగ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూల వేతనం (బేసిక్) సగటులో సగం పెన్షన్‌గా అందుతుంది.