Delhi Shocker: నడుస్తున్న వాషింగ్ మిషన్‌లోనే 15 నిమిషాల పాటూ ఉండిపోయిన ఏడాదిన్నర బాలుడు, వారం తర్వాత కోమా నుంచి క్షేమంగా బయటపడ్డ వండర్ కిడ్
చిన్నారిని ఆసుపత్రికి తరలించే వరకు చిన్నారి నీలి రంగులోకి మారడంతో పాటు స్పృహ తప్పిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని బాలుడికి చికిత్స అందించిన పిల్లల వైద్య నిపుణురాలు హిమాన్షి జోషి తెలిపారు
New Delhi, FEB 15: వాషింగ్ మెషిన్‌లో (washing machine) పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. కోమాలోకి వెళ్లిన చిన్నారి తిరిగి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకున్నది. ఢిల్లీకి చెందిన మహిళ ఇంట్లోని ఓ గదిలో ఉన్న టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసి ఆన్ చేసి వెళ్లింది. ఆమెకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. గదిలో బాబు కనిపించలేదు. 15 నిమిషాల తర్వాత వాషింగ్ మెషీన్‌లో కనిపించాడు. కుర్చీ సహాయంతో వాషింగ్ మెషిన్‌పైకి ఎక్కి ఉండవచ్చని తెలిపింది. ఆ తర్వాత వెంటనే వాషింగ్ మెషిన్‌లో (drowned in washing machine) నుంచి బాబు తీసి వెంటనే వసంత్‌కుంజ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించే వరకు చిన్నారి నీలి రంగులోకి మారడంతో పాటు స్పృహ తప్పిందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని బాలుడికి చికిత్స అందించిన పిల్లల వైద్య నిపుణురాలు హిమాన్షి జోషి తెలిపారు. అప్పటికే అవయవాలు పని చేయడం మానేశాయని తెలిపారు.
న్యుమోనియాతో పాటు జీర్ణకోశ ఇన్ఫెక్షన్ సైతం సోకిందని పేర్కొన్నారు. దాదాపు వారం రోజుల పాటు చిన్నారి కోమాలోకి వెళ్లాడని, వెంటిలేటర్‌పై ఉంచి యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్ సపోర్టుతో క్రమంగా కోలుకున్నట్లు పేర్కొన్నారు. వారం తర్వాత తల్లిని గుర్తించగలిగాడని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత జనరల్ వార్డుకు తరలించి చికిత్స అందించామని, అనంతరం మెదడు పనితీరును అంచనా వేసేందుకు సీటీ స్కాన్ నిర్వహించగా.. ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు వివరించారు.