ICSE, ISC Results 2021: ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల, SMS ద్వారా ఫలితాలు పొందే అవకాశం, అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 వరకు గడువు, విడుదలైన ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి
విడుదలైన ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది.
New Delhi, July 24: ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు (ICSE, ISC Result 2021) విడుదలయ్యాయి. విడుదలైన ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఈ ఫలితాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా కెరీర్స్ పోర్టల్ ద్వారా టాబ్యులేషన్ రిజిస్ట్రర్లను పాఠశాలలకు అందుబాటులో ఉంచుతున్నట్టు సీఐఎస్‌సీఈ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథోన్ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
దాదాపు మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను cisce.org లేదా results.cisce.orgలో అందుబాటులో ఉంచారు. అలాగే SMS ద్వారా ఫలితాలు పొందొచ్చు..సీఐఎస్‌సీఈ ఫలితాలను తెలుసుకొనేందుకు ఐసీఎస్‌ఈ విద్యార్థులైతే ICSE (Unique ID) టైప్ చేసి 09248082883 నంబర్‌కు పంపాలి. అలాగే, ఐఎస్‌సీ 12వ తరగతి విద్యార్థులైతే ISC (unique ID) టైప్ చేసి పైన పేర్కొన్న నెంబర్‌కే పంపి ఫలితాలు పొందవచ్చు.
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగడంతో ఐసీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. నిష్పాక్షిక, పారదర్శక విధానంలో విద్యార్థుల ప్రతిభను మదింపు వేసి ఫలితాలను ప్రకటించారు. ఫలితాలు, కేటాయించిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 వరకు గడువు ఇస్తున్నట్టు సీఐఎసీఈ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫలితాలతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వారికి కరోనాతో నెలకొన్న పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే బోర్డు స్పష్టంచేసింది.