Schools Reopening in AP: ఏపీలో ప్రతిరోజూ స్కూళ్లు తెరవాల్సిందే, స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ, టీచర్లు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని ఆదేశాలు, విద్యార్థులను స్కూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రప్పించవద్దని తెలిపిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు
టీచర్లు (Teachers) మాత్రమే ఆల్టర్నేటివ్ (రోజువిడిచి రోజు) విధానంలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ (Andhra Pradesh Department of School Education) ఉత్తర్వుల్లో తెలిపింది.
Amaravati, June 6: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ రోజూ తెరవాల్సిందేనని విద్యా శాఖ స్పష్టం చేసింది. టీచర్లు (Teachers) మాత్రమే ఆల్టర్నేటివ్ (రోజువిడిచి రోజు) విధానంలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ (Andhra Pradesh Department of School Education) ఉత్తర్వుల్లో తెలిపింది. జూలై ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తెరిచేందుకు (Schools Reopening in AP) పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జూన్ 30న మెమో 1441536ను జారీ చేశారు.
స్కూళ్లకు టీచర్లు ఒకటో తేదీన అందరూ హాజరు కావాలని, మరునాటి నుంచి రోజు విడిచి రోజు రావాలని అందులో పేర్కొన్నారు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ రప్పించవద్దని స్పష్టం చేశారు. 2వ తేదీ నుంచి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ టీచర్లు ఆల్టర్నేటివ్ రోజుల్లో స్కూళ్లకు హాజరు కావాలని సూచనల్లో ఉంది. ఈ మెమోలోని అంశాలపై టీచర్ల నుంచి సందేహాలు వ్యక్తం కావడంతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు వివరణ ఇచ్చారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు రోజూ 50 శాతం సిబ్బందితో నడవాలని పేర్కొన్నారు. టీచర్లు మాత్రం ఆల్టర్నేటివ్ రోజుల్లో హాజరు కావచ్చని, స్కూలు మాత్రం రోజూ నడవాలన్నారు.
సింగిల్ టీచర్లున్న స్కూళ్లు కూడా రోజూ హాఫ్ డే ఉండాలన్నారు. ఆ స్కూళ్ల టీచర్లు రోజూ స్కూలుకు హాజరు కావలసి ఉంటుందని వివరించారు. ఏ రోజు ఏ టీచర్ హాజరు కావాలన్న అంశాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.