Amaravati, July 6: ఏపీ రాష్ట్రంలో కరోనావైరస్ బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు (government employees) జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కోవిడ్ వైరస్ బారినపడిన ఉద్యోగులకు 20 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవులను ఐదు కేటగిరీలుగా విభజించింది.
కరోనా బారినపడిన ఉద్యోగి (corona-affected-ap-government-employees) హోం ఐసోలేషన్‌లో ఉంటే 20 రోజుల వరకు కమ్యూటెడ్ సెలవులు మంజూరు చేస్తారు. ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే 15 రోజులపాటు ప్రత్యేక సాధారణ సెలవులు ఇస్తారు. మిగతా ఐదు రోజులను ఈఎల్, హెచ్‌పీఎల్ నుంచి భర్తీ చేస్తారు. ఉద్యోగి ఒకవేళ ఆసుపత్రిలో చేరితే పాజిటివ్‌గా (Coronavirus) తేలినప్పటి నుంచి 20 రోజులపాటు సెలవులు ఇస్తారు. ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వైరస్ సంక్రమిస్తే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేస్తారు.
కరోనా సోకిన వ్యక్తికి కాంటాక్ట్ అయిన ఉద్యోగి హోం క్వారంటైన్‌లో ఉంటే ఏడు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోంగా పరిగణిస్తారు. కంటైన్‌మెంట్ జోన్ పరిధిలోని వ్యక్తి కరోనా బారినపడి క్వారంటైన్‌లో ఉంటే కంటైన్‌మెంట్ జోన్‌ను ఎత్తివేసే వరకు సదరు ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్టు లెక్కిస్తారు. ఈ ఏడాది మార్చి 25 నుంచే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
వీఆర్‌వోల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం : ఇక సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వీఆర్‌వోల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. గ్రేడ్–1 వీఆర్‌వోలకు నేరుగా సీనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పించేందుకు విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ చదివి, ఐదేళ్లు గ్రేడ్–1 వీఆర్‌వోగా సర్వీసు పూర్తి చేసినవారికి నేరుగా సీనియర్ అసిస్టెంట్ పదోన్నతికి అర్హత ఉంటుందని తెలిపారు. రెవెన్యూ శాఖలో పనిచేసే గ్రేడ్–1 వీఆర్‌వోలు, జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టుల మధ్య 60:40 నిష్పత్తిలో.. జిల్లా స్థాయిలో రొటేషన్ పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తారు.
పదోన్నతి పొందిన వీఆర్‌వోలు.. మొదట సీనియర్ అసిస్టెంట్లుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్‌లో రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా వారిని ఫీల్డ్ వర్క్‌కి పంపకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక అన్ని డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే కంప్యూటర్, ఆటోమేషన్ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు.
ఇవన్నీ రెండేళ్లలోపు పూర్తి చేయకపోతే వారిని తిరిగి వీఆర్‌వోలుగా పంపుతామన్నారు. రెండేళ్లలో ఈ అర్హతలన్నీ సాధించినవారిని రెగ్యులరైజ్ చేయడంతోపాటు సీనియారిటీని కూడా నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగుణంగా 1998 ఏపీ మినిస్టీరియల్ సర్వీసు రూల్స్‌ని సాధారణ పరిపాలన శాఖ సవరిస్తుందన్నారు.