Monocrotophos Banned: మోనోక్రొటోఫాస్ పై కేంద్రం నిషేధం.. మరో మూడు రకాల పురుగు మందులూ బ్యాన్
కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనున్న నేపథ్యంలో నిషేధిత ప్రాథమిక జాబితా(27)లోని నాలుగు క్రిమి సంహారక మందుల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొన్నది.
Newdelhi, Oct 9: కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో (Supremecourt) కీలక విచారణ జరుగనున్న నేపథ్యంలో నిషేధిత ప్రాథమిక జాబితా(27)లోని నాలుగు క్రిమి సంహారక మందుల వినియోగాన్ని నిషేధిస్తూ (Banned) కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొన్నది. వీటిలో ‘మోనోక్రొటోఫస్’ (Monocrotophos) పురుగుల మందుతోపాటు డికోఫోల్, డినోక్యాప్, మిథోమైల్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసుకొనేందుకు నిల్వల గడువు కాలం ముగిసే వరకు మాత్రమే ‘మోనోక్రొటోఫాస్ 36% ఎస్‌ఎల్’ అమ్మకాలు, పంపిణీ, వినియోగానికి అనుమతి ఉంటుందని ఉత్తర్వు పేర్కొన్నది. అయితే దీనిపై పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్(పీఏఎన్) అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టాక్ అయిపోయేంత వరకు మోనోక్రొటోఫాస్ ను దీర్ఘకాలం వినియోగించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నది. అన్ని మోనోక్రొటోఫాస్ ఫార్ములేషన్ల తయారీని నిషేధించేలా ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరాన్ని పీఏఎన్ నొక్కిచెప్పింది.
ఐసీఏఆర్ ఏమన్నదంటే?
27 క్రిమి సంహారక మందుల్లో కేవలం మూడింటిపైనే నిషేధం కొనసాగించాలని, మిగతా వాటిని మినహాయించాలని పేర్కొంటూ ఇండియన్ కౌన్సిల్ ఆప్ అగ్రికల్చర్ రిసెర్చ్(ఐసీఏఆర్) మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ టీపీ రాజేంద్రన్ కమిటీ సూచించింది. ఈ మేరకు వాటిని మినహాయిస్తూ కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకొన్నది. దీన్ని వ్యతిరేకిస్తూ పలు పౌర సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.