IND Vs AUS (PIC@ ICC X)

Chennai, OCT 08: టీమ్‌ ఇండియా వన్డే ప్రపంచకప్‌ (ICC World Cup) వేట ప్రారంభించింది. ఇటీవల ఆసియా కప్‌ చేజిక్కించుకున్న భారత్‌.. అదే జోరుతో వరల్డ్‌కప్‌లోనూ శుభారంభం చేసింది. పుష్కర కాలం తర్వాత భారత్‌లో జరుగుతున్న మెగాటోర్నీలో తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ లో ఘన విజయం సాధించింది. కోహ్లీ (Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) అద్భుతమైన ఇన్నింగ్స్‌ తో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోహ్లీ సెంచరీ మిస్ అయినప్పటికీ కీలక ఇన్నింగ్స్ తో అలరించాడు. కే ఎల్ రాహుల్ 97 పరుగులతో నాటౌట్‌ గా నిలిచాడు, అంతకుముందు కోహ్లీ 85 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

 

అంతకుముందు ఆస్ట్రేలియా తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ అయ్యింది. నిర్ణీత 50 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయకుండానే తోక ముడిచింది. 49.3 ఓవర్లలో 199 పరుగులకు చాప చుట్టేసింది. భారత్‌ ముందు 200 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్‌ బ్యాటర్‌లలో డేవిడ్‌ వార్నర్‌ (41), స్టీవెన్‌ స్మిత్‌ (46) మాత్రమే పరవాలేదనిపించారు. టీమిండియా బౌలర్‌లు రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.

 

ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. మ్యాచ్‌ ప్రారంభం నుంచే పరుగులు రాబట్టడానికి తంటాలు పడింది. వార్నర్‌, స్టీవెన్‌ స్మిత్‌ కొంతసేపు నిలకడగా ఆడటంతో స్కోర్‌ బోర్డు మెల్లగా ముందుకు సాగింది. ఆ ఇద్దరూ ఔటైన తర్వాత జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. చివర్లో మిచెల్ స్టార్క్‌ (28) రాణించడంతో ఆసీస్‌ ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్‌నైనా చేయగలిగింది.

మూడో ఓవర్‌లో జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత వార్నర్‌, స్టీవెన్‌ స్మిత్‌ నిలకడగా ఆడారు. కానీ 17వ ఓవర్లో వార్నర్‌ ఔట్‌తో వికెట్ల పతనం మొదలైంది. 28వ ఓవర్లో స్టీవెన్‌ స్మిత్‌ ఔట్‌తో పరిస్థితి మరింత దిగజారింది. లబుషేన్‌ (27), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (15), పాట్‌ కమ్మిన్స్‌ (15) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

మిగతా బ్యాటర్లలో అలెక్స్‌ క్యారీ, కామెరూన్‌ గ్రీన్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారత బౌలర్‌లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ సిరాజ్‌ తలా ఓ వికెట్ పడగొట్టారు. భారత బౌలింగ్‌ ధాటికి అద్భుతమైన ఫీల్డింగ్ కూడా తోడు కావడంతో ఆసీస్‌ తక్కువ స్కోర్‌కు ఆలౌట్‌ అయ్యింది.