Aadhaar Card update: మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయో తెలుసా? ఆధార్‌కు లింక్ అయిన సిమ్ కార్డులను తెలుసుకునేందుకు టెలికాం విభాగం కొత్త పద్దతి, ఇది ఫాలో అయితే చాలు తెలుసుకోవచ్చు
TAFCOP ద్వారా ఒక్కో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో, మొత్తం సిం కార్డులు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే వీలుంటుంది.
New Delhi, May 28: కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న వ్యక్తిగత గుర్తింపు కార్డు ఆధార్ కార్డు (Aadhar card) వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వ పధకాల కోసమే కాకుండా..ఆర్థికపరమైన, ఇతర వ్యక్తిగత విషయాల్లోనూ ప్రస్తుత రోజుల్లో ఆధార్ తప్పనిసరి అయింది. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ సహా ఇతర వ్యక్తిగత వివరాలు ఉండే ఈ ఆధార్ కార్డుతో బ్యాంకు, ఇన్సూరెన్సు ఇతర పనులను చక్కబెట్టుకోవచ్చు. కేవైసీ (KYC) పేరుతో మొబైల్ కంపెనీలు సైతం..సిమ్ కార్డు కొనుగోలు సమయంలో మన ఆధార్ కార్డును ప్రూఫ్ గా పెట్టుకుని సిమ్ కార్డును ఇస్తున్నాయి. ఒక్కో వ్యక్తి వద్ద రెండేసి సిమ్ కార్డులు (SIM Cards) సర్వసాధారణం అయిన ఈరోజుల్లో..కొత్త..పాత కలిపి ఒక ఆధార్ కార్డుపై అసలు మొత్తం ఎన్ని సిమ్ కార్డులు (SIM cards) ఉన్నాయో కూడా ఒక్కోసారి మనకు తెలియకపోవచ్చు.
అందుకోసమే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్’ (DoT) ఆధ్వర్యంలో..”Telecom Analytics for Fraud management and Consumer Protection (TAFCOP)” అనే సరికొత్త విభాగాన్ని ప్రవేశపెట్టారు. TAFCOP ద్వారా ఒక్కో వ్యక్తికి చెందిన ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో, మొత్తం సిం కార్డులు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే వీలుంటుంది. అందుకోసం TAFCOP ప్రత్యేక వెబ్ పోర్టల్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయి ఉన్నాయో తెలుసుకోవాలంటే..ముందుగా..
స్టెప్ 1: TAFCOP అధికారిక వెబ్‌సైట్ “tafcop.dgtelecom.gov.in”ను తెరవండి
స్టెప్ 2: మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే OTP వస్తుంది
స్టెప్ 3: పోర్టల్‌కి సైన్ ఇన్ చేయడానికి OTPని నమోదు చేసి, ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయండి.
స్టెప్ 4: సైన్-ఇన్ ప్రక్రియను పూర్తి చేయండి(అవసరం ఉంటేనే).
స్టెప్ 5: మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడిన అన్ని మొబైల్ నంబర్‌లు అక్కడ దర్శనమిస్తాయి
స్టెప్ 6: మీరు ప్రస్తుతం వాడుతున్నా, వాడుకలో లేని నంబర్లను గుర్తించి వాటిపై అవసరమైతే రిపోర్ట్ చేయండి
సాధారణంగా ఒక్కో వ్యక్తి ఆధార్ కార్డుపై సుమారు 9 ఫోన్ నెంబర్లు లింక్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. భద్రత కారణాల దృష్ట్యా ప్రజలు తమ ఆధార్ వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.