Hair Offering Ticket Price Hike: ఏపీ ఆలయాల్లో తలనీలాల టికెట్ ధర పెంపు.. ప్రస్తుత రూ. 25 నుంచి రూ. 40కి పెంచుతూ ఉత్తర్వులు జారీ.. క్షురకులకు గుడ్ న్యూస్.. నెలకు కనీసం రూ. 20వేల కమిషన్ ఇచ్చేలా ప్రభుత్వ ఉత్తర్వులు
ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధరను రూ. 40కి పెంచింది. అలాగే, తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు శుభవార్త చెప్పింది.
Vijayawada, March 17: దేవాదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లో తలనీలాల టికెట్ (Hair Offering Tickets) ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధరను (Ticket Price) రూ. 40కి పెంచింది. అలాగే, తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు శుభవార్త చెప్పింది. నెలకు కనీసం రూ. 20 వేల చొప్పున కమిషన్ వచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ మొత్తాన్ని వారికి ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ ముఖ్యకార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో కేశఖండన విధులు నిర్వర్తించే క్షురకులు 1,100 మంది ఉంటారని తెలుస్తోంది.
ఇకపై తలనీలాల టికెట్లపై వచ్చే ఆదాయం మొత్తం వారికే..
ప్రస్తుతం తలనీలాల కోసమని భక్తుల నుంచి వసూలు చేస్తున్న రూ. 25 ద్వారా వచ్చే ఆదాయాన్ని క్షురకులకు ఇస్తున్నారు. అయితే, ఈ మొత్తం సరిపోవడం లేదని, ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమకు రెగ్యులర్ ఉద్యోగుల్లానే కనీస వేతనం ఇవ్వాలంటూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం పెంచిన టికెట్ ధర రూ. 40 ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని క్షురకులకే ఇస్తారు. అంటే తలనీలాల టికెట్లపై వచ్చే ఆదాయాన్ని ఆలయంలోని క్షురకులందరికీ సమానంగా పంచుతారు.
పంచినప్పుడు సరిపోకపోతే ఇలా చేస్తారు
అలా పంచినప్పుడు ఒకవేళ వారి కమిషన్ రూ. 20 వేల కంటే తక్కువగా వస్తే అప్పుడు తలనీలాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అవి కూడా సరిపోని పక్షంలో ఆలయ ఆదాయంలో మూడు శాతం కమిషన్‌ను వినియోగించుకోవచ్చు. అప్పటికీ సరిపోకుంటే మిగిలిన మొత్తం కోసం ఆలయ అధికారులు కమిషనర్ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిబంధనలు ఇవి..
- గతేడాది జనవరి నుంచి పనిచేస్తున్న క్షరుకులకే తాజా ఉత్తర్వులు వర్తిస్తాయి.
- ఆలయాల్లోని క్షురకులకు ఏడాదిలో కనీసం 100 రోజుల పని చేయాలి.