APSRTC Discount: శుభవార్త.. సంక్రాంతి బస్సులకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ
స్పెషల్ బస్సుల్లో రానుపోను టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు.
Vijayawada, Dec 20: సంక్రాంతి పండుగకు (Sankranti Festival) సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికులకు (Passengers) ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) శుభవార్త చెప్పింది. పండుగ పూట రద్దీని తట్టుకునేందుకు 6,400 ప్రత్యేక బస్సులు (Special Buses) నడుపుతున్నట్టు ప్రకటించింది. అయితే, ఈసారి ఈ స్పెషల్ బస్సుల్లో ‘అదనపు’ బాదుడుకు స్వస్తి పలికిన అధికారులు.. ప్రత్యేక రాయితీ (Special Discount) కూడా కల్పించడం విశేషం.
అవును.. స్పెషల్ బస్సుల్లో రానుపోను టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరి 6వ తేదీ నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, పండుగ రద్దీని బట్టి 15 నుంచి 18 వరకు ఆయా బస్ డిపోల నుంచి బస్సులు అందుబాటులో ఉంచనున్నారు.
క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పొరుగు, ఇతర రాష్ట్రాల నుంచి సంక్రాంతికి వచ్చే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి పండుగ ముందు 3,120 బస్సులు, పండుగ తర్వాత 3,280 బస్సులు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. బస్సు బయలుదేరిన తర్వాత కూడా అందుబాటులో ఉన్న సీట్లను బట్టి యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.