New Delhi, Dec 19: భారతదేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై కేంద్రం (center Financial Ministry) లోక్ సభ వేదికగా స్పష్టతనిచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి (Union Finance (Assistance) Minister Pankaj Choudhary) రాష్ట్రాల అప్పుల వివరాలను (list of states debts 2022) వెల్లడించారు.
దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లుగా తేలింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ అప్పు రూ. 6,53,307 కోట్లు, మూడో స్థానంలో మహారాష్ట్ర అప్పు రూ. 6,08,999 కోట్లు, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్ అప్పు రూ. 5,62, 697 కోట్లుగా తేలింది. ఇక ఐదో స్థానంలో రాజస్థాన్ అప్పు రూ. 4,77,177 కోట్ల రూపాయలుగా ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆరో స్థానంలో కర్ణాటక అప్పు రూ. 4,61,832 కోట్లతో నిలిచింది. ఏడు స్థానంలో గుజరాత్ అప్పు రూ. 4,02,785 కోట్లుగా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 11వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఏపీ అప్పు రూ. 3,98,903 కోట్ల రూపాయలు, తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్ల రూపాయలుగా తెలిపింది కేంద్రం. ఏపీ అప్పుల పెరుగుదల 10.7 శాతంతో దేశంలో 15వ స్థానంలో నిలవగా.. తెలంగాణ మాత్రం 16.7 శాతంతో అప్పుల పెరుగుదలలో దేశంలో ఆరో స్థానంలో నిలిచింది.
ఏపీ రాష్ట్రంలో 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, కానీ 2020-21 నాటికి అప్పుల పెరుగుదల 17.1 శాతంగా ఉందని వివరించింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగిందని తెలిపింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతం ఉంటే... 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని వివరించింది.
2015లో ఏపీ రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉన్నాయని, అదే 2021కి వచ్చేసరికి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ తన సమాధానంలో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా తెలియజేశారు.