Cyclone Tauktae Update: ఆరు రాష్ట్రాలకు తౌక్టే తుఫాను ముప్పు, కర్ణాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు మృతి, ఈ నెల 18న ఉదయం గుజరాత్ తీరాన్ని తాకనున్న తౌక్టే తుఫాను, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
18న మ.2:30 నుంచి రా.8:30 మధ్య తీరం దాటే అవకాశం ఉందని, పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనుందని తెలిపింది.
Gandhi Nagar, May 16: అరేబియా సముద్రంలో ఏర్పడి తీరం వైపు దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్ (Cyclone Tauktae Update) ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. గోవాకు ఉత్తర వాయవ్యంలో తుపాను కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ నెల 18న ఉదయం గుజరాత్ తీరాన్ని తాకనుందని (Cyclone Tauktae Expected To Reach Gujarat Coast on Morning of May 18) భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. 18న మ.2:30 నుంచి రా.8:30 మధ్య తీరం దాటే అవకాశం ఉందని, పోర్‌బందర్-నలియా మధ్య తీరం దాటనుందని తెలిపింది.
తౌక్టే తుఫాన్ తీరాన్ని తాకేటప్పుడు గంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈదురు గాలులకు తోడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rainfall, Strong Winds & Storm Surge) కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపై తౌక్టే ప్రభావం చూపనుందని, ముంబైలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా, తుపాను ప్రభావంతో కర్ణాటకలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 6 జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో నలుగురు మృతి చెందారు. కర్ణాటకలో 73 గ్రామాలపై తౌక్టే తుపాను ప్రభావం చూపుతోంది. ‘తౌక్టే' తుపానుపై ప్రధాని మోదీ సమీక్షించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఇదిలావుంటే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం 79 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. మరో 22 బృందాలను పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చోటుకు తరలించేందుకు సిద్ధంగా ఉంచింది. ఎన్డీఆర్ఎఫ్‌తోపాటు ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్స్ కూడా సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. సహాయక చర్యల కోసం పడవలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా వినియోగించనున్నారు.
కేరళ రాష్ట్రాన్ని తౌక్టే తుఫాన్ వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర జిల్లాలైన మల్లాపురం, కొళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్, అళప్పుల,కొట్టాయం,ఇడుక్కి,ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాల్లో తుఫాను ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతాల్లో సముద్రం ఆకస్మికంగా ముందుకు రాంవడంతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. వందలాది ఇళ్లు దెబ్బ తినగా చెట్లు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ప్రధాన నదులైన మీనాచిర్, అచన్ కోల్, మనిమాలల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇడుక్కి జిల్లాలోని కల్లార్ కుట్టి, మాలాంకర, భూతథంకెట్టు ఆనకట్టలు, పథనందిట్ట జిల్లాలోని మణియార్ ఆనకట్టల గేట్లను ఎత్తివేశారు. చెట్లు విరిగి ఇళ్లు వాహనాలపై పడటంతో ఇడుక్కి జిల్లాలోని మున్నార్-వత్తవాడ మార్గంలో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Here's ANI Update
చాలా తీవ్రమైన తుఫాను "టౌక్టే" కారణంగా గోవా మార్గంలో, చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే, అన్ని విమానయాన సంస్థలు ఈ రోజు గోవాకు మరియు బయటికి తమ విమాన కార్యకలాపాలను రద్దు చేశామని గోవా విమానాశ్రయం అధికారులు తెలిపారు.
Here's ANI Update
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ తీరానికి చేరువ అవుతుండటంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ గాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. తుఫాను తీరానికి మరింత చేరువైతే పరిస్థితి ఇంకా బీభత్సంగా మారే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. గోవా తీరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.