Cyclone Tauktae Update: మరో 2 రోజులు..వణికిస్తున్న తౌక్టే తుఫాన్, మహారాష్ట్ర, కేరళలో భారీ వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం
Cyclone Tauktae Path (Photo Credits: IMD)

Mumbai, May 16: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తౌక్టే తుపానుగా (Cyclone Tauktae Intensifies Into 'Very Severe Cyclonic Storm) రూపాంతరం చెందింది. కేరళ, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌పై తుపాను ప్రభావం (Maharashtra and Gujarat All Set To Face Fury) అదికంగా ఉండనుంది. ఈ నెల 18న తుపాను గుజరాత్‌ వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ అధికారులు సూచించన సంగతి తెలిసిందే.కాగా తౌక్టే తుఫాన్‌ ఆదివారం వేకుమజామున మహారాష్ట్రలోకి ప్రవేశించనుండటంతో 21 జిల్లాల్లో అధికారులు అలర్ట్‌ ప్రకటించారు.

5 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్, మరో 16 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఇక తౌక్టే తుపాన్‌ ప్రభావంతో మహారాష్ట్రలోని సింధుదుర్గా, రత్నగిరి జిల్లాల్లో ఇప్పటికే ఈదురు గాలులతోపాటు మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. అనేక తీర ప్రాంతాల్లో సముద్ర అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతుండగా మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకూలాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

ముఖ్యంగా తౌక్టే తుఫాన్‌ మహారాష్ట్రలోకి ఆదివారం వేకువజామున ప్రవేశించనుందని అంచనా. అయితే సముద్రతీరానికి సుమారు 350 కిలోమీటర్ల దూరం నుంచి ఈ టౌటే తుఫాన్‌ గుజరాత్‌ దిశగా ముందుకుసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌ ముందుకు సాగుతున్న కొద్దీ బలపడుతోంది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడనుంది. ఇలాంటి నేపథ్యంలో అధికారులు అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ముంచుకొస్తున్న తౌక్టే తుఫాను ముప్పు, వాయుగుండంగా మారిన అల్ప పీడనం, ఈ నెల 8న తౌక్టే గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన ఐఎండీ

ముంబై కొలాబా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో అలర్ట్‌ను జారీ చేశారు. వీటిలో కొంకణ్‌తో పాటు విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని జిల్లాలున్నాయి. ఆరెంజ్‌ అలర్ట్‌ జిల్లాలలో సింధుదుర్గా, రత్నగిరి, సాతారా, సాంగ్లీ, కోల్హపూర్‌ ఉన్నాయి. మరోవైపు ఎల్లో అలర్ట్‌ జిల్లాల్లో విదర్భలోని 11 జిల్లాలతోపాటు ముంబై, థానే, పాల్ఘర్, రాయిగడ్, పుణేలున్నాయి.

సముద్ర తీరానికి దూరం నుంచే గుజరాత్‌లో మే 18వ తేదీ తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 16, 17, 18వ తేదీలలో మహారాష్ట్రపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి నేపథ్యంలో కొంకణ్‌లోని సింధుదుర్గా, రత్నగిరి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయగా రాయిగఢ్, ముంబై, థానే, పాల్ఘర్‌ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. సింధుదుర్గా జిల్లాల్లోని 38 గ్రామాలకు తుఫాన్‌ ముప్పు ఏర్పడింది. దీంతో అక్కడి అధిక ముప్పు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు.

కరోనాకు తోడవుతున్న తీవ్ర తుఫాన్, అరేబియా సముద్రంలో పుట్టిన తౌక్టే, పశ్చిమ తీరాన్ని వణికించేందుకు రెడీ, ఈ నెల 16 నాటికి తుపాను తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపిన ఐఎండీ

తుఫాను కల్లోలం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. గుజరాత్‌ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్‌ ఆస్పత్రులు, వ్యాక్సిన్‌ కోల్డ్‌స్టోరేజ్‌ సెంటర్లకు.. విద్యుత్‌ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు.

కేరళలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. వేర్వేరుచోట్ల ఇద్దరు మరణించారు. తౌక్టే తుఫాన్‌ ముప్పుతో కేరళలోని 9 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. మణిమాల, అచన్‌కోవిల్‌ వంటి నదుల్లో ప్రవాహ స్థాయిలు పెరుగడంతో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరిక జారీ చేసింది.

గుజరాత్‌లోని 15 జిల్లాల్లో తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రతినిధి తెలిపారు. తౌక్టే ప్రభావంతో సౌరాష్ట్ర లోని పలు ప్రాంతాలలో నష్టం భారీగా ఉంటుందని, ఇండ్లు, రోడ్డు, విద్యుత్తు, సమాచార వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. గోవాతో పాటు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌, రత్నగిరి జిల్లాలపై తుఫాన్‌ ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది.

తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైనా ఉంటుందని, వివిధ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రధానంగా రాష్ట్ర దక్షిణ, మధ్య ప్రాంతంలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల, అదే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. సాధారణ ఉష్ణోగ్రతలే...రాష్ట్రంలో శనివారం సాధారణ ఉష్ణోగ్రతలు æనమోదయ్యాయి. నల్లగొండలో 42.5 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్‌లో 22.8 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తుపాను ప్రభావం రాష్ట్రంపైన ఉండడంతో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.