Cyclone 'Fengal' Update: వణికిస్తున్న'ఫెంగల్' తుఫాను.. తమిళనాడు సహా దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు.. తూర్పు తెలంగాణలోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు
శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటింది.
Chennai, Dec 1: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన 'ఫెంగల్' తుఫాను (Fengal Cyclone ) తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి (Puducherry) సమీపంలో తుఫాను తీరం దాటింది. తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాలన్నీ నీటమునిగాయి. తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. చెన్నైలోని ప్యారీస్ ప్రాంతంలో విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మరణించారు. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఆదివారం చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
తీరం దాటిన ఫెంగల్ తుఫాన్, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం
ఆకస్మిక వరదలు
తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అటు తూర్పు తెలంగాణలోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఫెంగల్ తుఫాను 3D విజువల్స్...90 కిమీల వేగంతో తీరం దాటనున్న తుపాను..వీడియో ఇదిగో