Breast Milk for Sale: వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది.
Newdelhi, May 27: నవజాత శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి (Complete Health), శారీరక పెరుగుదలకు తల్లిపాలు (Mother Breast Milk) ఎంతో తోడ్పాటును అందిస్తాయి. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి (Immune System) అందుతుంది. అయితే, కొందరు తల్లులకు పాలు రాకపోవడం, కొందరు శిశువులకు తల్లిపాలు అందని పరిస్థితులు ఏర్పడడం నేపథ్యంలో, ప్రభుత్వమే పాల బ్యాంకులు ఏర్పాటు చేసి ఉచితంగా తల్లిపాలను అందిస్తోంది. అయితే, ప్రభుత్వమే కాకుండా కొందరు వ్యాపార దృక్పథంతో తల్లిపాలను విక్రయిస్తున్నారని, ఆన్ లైన్ లో ఇలాంటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాపార కోణంలో తల్లి పాలను విక్రయించడం చట్ట వ్యతిరేకమని, అలా ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) హెచ్చరించింది. ఎఫ్ఎస్ఎస్-2006 యాక్ట్ ప్రకారం తల్లి పాల విక్రయానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
ప్రభుత్వాలకు సూచన
అనుమతి లేని ఇలాంటి అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు, తల్లిపాల విక్రయానికి ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది.