Cyclone Mandous: మాండూస్ తుపాన్‌గా మారనున్న వాయుగుండం, చిత్తూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు, తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడి
దీనివల్ల చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది.
Chittoor, Dec 7: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనివల్ల చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది. వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలై తూర్పు ఆగ్నేయంగా 770 కిలో మీటర్లు, చెన్నైకు 1020 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని తెలిపారు.
గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు- దక్షిణకోస్తాంధ్ర తీరాలకు తుఫాన్ చేరనుందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains lash) కురిసే అవకాశముంది.
తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఆయా ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. కాగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఈ జిల్లాకు రెడ్ అలెర్ట్ (red alert issued in Chittoor) ప్రకటించిన అధికారులు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా చిత్తూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.