Mi-17V5 Chopper: గంటకు 225- 250 కి. మీ వేగం, 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం, బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ Mi-17V-5 ప్రత్యేకతలు ఇవే..
ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికా రావత్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణించగా, 13 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
New Delhi, Dec 8: తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికా రావత్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణించగా, 13 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన ఒకరు 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని వార్తలు వస్తున్నాయి.
ఘటనాస్థలిలో మృతదేహాలు ముద్దముద్దలుగా మారిపోయాయి. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు మాడిమసైపోయాయి. డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను కూనూరు ఎయిర్‌బేస్‌లోని వెల్లింగ్‌టన్ ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో రావత్‌కు ( CDS Bipin Rawat on board) ముగ్గురు డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. కేబినెట్ సమావేశం తరువాత కేంద్ర రక్షణ శాఖ మంత్రిరాజ్‌నాథ్ సింగ్ ఘటనా స్థలానికి వెళ్లనున్నారు.
ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని మాజీ ఎమ్‌ఐ-17 పైలెట్ అమితాబ్ రంజన్ అన్నారు. కాగా ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాప్టర్ MI-17V5 గా గుర్తించారు. ఈ హెలికాప్టర్ భారత ఆర్మీలో చాలా ప్రత్యేకమైంది. Mi-17V5 (Mi-17V5 Chopper) అనేది భారత వైమానిక దళం ఉపయోగించే ఆధునిక రవాణా హెలికాప్టర్. ఇది Mi-8/17 కుటుంబానికి చెందిన మిలిటరీ రవాణా విమానం. రష్యన్ హెలిక్యాప్టర్స్‌కు చెందిన సబ్సిడరీ అయిన కజాన్ హెలికాప్టర్స్ దీనిని తయారుచేసింది. వీటిని భద్రతాబలాగాల రవాణా, ఆయుధ రవాణా, అగ్నిప్రమాదాల కట్టడితోపాటు కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్ విధుల్లో, గాలింపు, రక్షణ ఆపరేషన్‌లలో వినియోగిస్తున్నారు.
రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్‌పోర్ట్ 2008లో భారత ప్రభుత్వంతో 80 Mi-17V5 హెలికాప్టర్‌లను పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 17 ఫిబ్రవరి 2012న భారత వైమానిక దళంలోకి చేర్చబడింది. ఒప్పందం ప్రక్రియ 2013లో పూర్తయింది. 2013 ప్రారంభం వరకు మొత్తం 36 హెలికాప్టర్‌లను డెలివరీ చేసింది. భారత వైమానిక దళం కోసం 71 Mi-17V5 హెలికాప్టర్‌ల డెలివరీ కోసం కొత్త ఒప్పందాలు కుదిరాయి. బిపిన్ రావత్ ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్. ఇది 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్. దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది.ఆర్మీలో ప్రస్తుతం 151 ఎంఐ 17 హెలికాప్టర్‌లు ఉన్నాయి
Mi-17V5 ప్రత్యేకతలు ఏంటంటే.. బలమైన సాంకేతిక సామర్థ్యంతో కూడిన హెవీ ట్రాన్స్‌పోర్టు హెలికాప్టర్ ఇది. ఒకేసారి 36 మందిని మోసుకెళ్లగల సత్తా దీనికి ఉంది. వీఐపీ చాపర్ కోసం ఉపయోగిస్తుంటారు. పైలెట్లకు హిమాలయాలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లో నడిపిన అనుభవం ఉంటేనే దీన్ని నడపగలరు. గంటకు 225- 250 కి. మీ వేగంతో ప్రయాణం చేస్తుంది. 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం చేయగలదు. గరిష్టంగా 13,000 కిలోల టేకాఫ్ బరువును మోసుకెళ్లగలిగే సామర్ధ్యం దీనికి ఉంది. ఎడారి వంటి అన్ని ప్రతికూల పరిస్థితులలో సమర్థంగా పని చేసేలా దీన్ని రూపొందించారు.