Heavy Rain Forecast: మరో తుఫాను ముప్పు, 4 రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక, తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రెండో తేదీన బురేవి తుపాన్‌గా అవకాశం
రానున్న తుఫాను మొత్తం నాలుగు రాష్ట్రాలను వణికించనుంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు (Heavy Rain Forecast) కురవనున్నాయి.
Chennai, Nov 30: నివర్ తుఫాన్ రేపిన కల్లోలం మరవక ముందే మరోసారి తుఫాన్ విరుచుకుపడనుంది. రానున్న తుఫాను మొత్తం నాలుగు రాష్ట్రాలను వణికించనుంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు (Heavy Rain Forecast) కురవనున్నాయి. రెండో తేదీ అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉండడంతో ముందుగానే ఐంఎండీ ( India Meteorological Department (IMD) అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించేశారు. నివర్ తుపాన్ తీరం దాటి నాలుగు రోజులు అవుతున్నా, చెన్నై శివార్లలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు ఇంకా తొలగలేదు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay of Bengal) అండమాన్‌కు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం (Low depression) ఆదివారం మరింతగా బలపడింది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ మరింతగా బలపడనున్న దృష్ట్యా, ఈ ప్రభావం నాలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై రానున్న తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తొలుత సముద్ర తీర జిల్లాలో మోస్తరు వర్షం, రెండో తేదీ అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రెండో తేదీన బురేవి తుపాన్‌గా మారి అతి భారీ వర్షాలు పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆదివారం రెడ్ అలర్ట్ (Red and Orange alerts) ప్రకటించారు. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో అధికార వర్గాలు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టే పనిలోపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
నివర్ (Cyclone Nivar) రూపంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేసి, కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు సోమవారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడు గురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాత్రి చెన్నైకు వచ్చే ఈ బృందం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ అవుతుంది. ఆ తర్వాత నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. చివరగా చెన్నైలో సీఎం పళనిస్వామితో ఈ బృందం భేటీ అవుతుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక మేరకు కేంద్రం సాయం ప్రకటించనుంది.
కాగా నివర్ తుఫాను ధాటికి నలుగురు మరణించినట్టు, ఐదుగురు గాయపడ్డట్టు తేల్చారు. 14 ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతింది. పది వేల హెక్టార్లలోని పంటల్లో వరద నీళ్లు చొచ్చుకెళ్లాయి. 108 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 2,927 స్తంభాలు ఒరిగాయి. 199 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 1,439 గుడిసెలు పాక్షికంగా దెబ్బ తినగా, 302 గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 245 పశువులు మరణించాయి. 2,064 చెట్లు నేలకొరిగాయి. 4,139 శిబి రాల్లో 2.32 లక్షల మంది సురక్షితంగా ఉన్నట్టు తాజా నివేదికలో పేర్కొన్నారు.