Kakinada, November 29: తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం సముద్రం ఒడ్డున బంగారం ముక్కలు (Gold Found on Uppada Beach) కనిపించాయని ఓ మహిళ చెప్పడంతో జనమంతా ఎగబడ్డారు. ఇసుకలో చిన్న చిన్న బంగారు ముక్కలు కనిపించడంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఉప్పాడ శివారు పాత మార్కెట్ సమీపంలోని (Uppada Village) తీర ప్రాంతంలో మూడు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. శనివారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు.
మహిళలు, చిన్నారులు సైతం దువ్వెనలు, పుల్లలు, జల్లెళ్లలో ఇసుకను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మహిళలకు బంగారం రేణువులు, రూపులు, దిద్దులు, ఉంగారాలలో పాటు బంగారు, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో పెద్దపెద్ద బంగ్లాలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయట పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు పురాతన ఇళ్లు కూలిపోయాయి. ఎక్కడి వాళ్లు అక్కడ ప్రాణాలు అరచేత పట్టుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, ఎవరు సముద్రం వైపు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బంగారం వేట మొదలుపెట్టారు.
ఇదంతా కరెక్ట్ కాదని అధికారులు అంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు చాలా ఇల్లు కూలిపోవడం చాలా మంది ప్రాణాలు కోల్పోవడం ,అలా కొట్టుకువచ్చినవి సముద్రంలో కలవడంతో ఏదైనా బంగారం దొరికిందేమో అని, సముద్రం లోపల నుండి బంగారం రావడం మాత్రం వాస్తవం కాదని చెబుతున్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని అధికారులు, పోలీసులు పేర్కొంటున్నారు . సముద్రం అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో ప్రజలు అక్కడికి వెళ్లడం మంచిది కాదంటున్నారు.