Weather Forecast: వాతావరణంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు, తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న భారీ వర్షాలు

దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.

Rains (Photo-Twitter)

Hyd, Sep 8: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో మనుపెన్నడూ లేనంతగా తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావడం.. వాటికి తోడుగా తుపాన్లు, ఇక వర్షాలు ఆలస్యం కావడం.. ఆ వెంటనే అనుకోకుండా కుంభవృష్టి వర్షాలు ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా రావడంతో వాతావరణం పెను మార్పులకు లోనవుతోంది. అన్‌సీజన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటుగా మళ్లీ కుండపోత వానలు.. ఇలా వాతావరణం గందరగోళంగా తయారవడంతో తెలుగు రాష్ట్రాలపైనా ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ వాతావరణం గందరగోళంగా ఉంది. గాలుల వేగం పెరగడంతో.. వాతావరణం వేగంగా మారుతోంది. ఆలస్యంగా వచ్చిన నైరుతీ రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలవొచ్చని(ఈ నెలలోనే!) ఐఎండీ అంచనా వేస్తోంది.

బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు, మ‌రో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

తాజాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణలో విస్తారంగా.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేటి నుంచి రేపు ఉదయం వరకు ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

తెలంగాణవ్యాప్తంగా మ‌రో ఐదు రోజులు కుండపోత‌.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

నిన్న కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో నిన్న అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగానే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 72.10 సెంటీమీటర్లు కాగా, నిన్నటికే 74.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది.

శుక్ర, శనివారాల్లో తెలంగాణ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణను అప్రమత్తం చేసింది. అలాగే.. మూడు నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్రపై ఏర్పడిన అల్పపీడనం బలహీనపడగా.. మరో ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావం కారణంగా.. వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది విశాఖ వాతావరణ కేంద్రం.

శుక్రవారం.. పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే.. శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ,అనకాపల్లి,అల్లూరి , పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగానే..

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగానే నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఏటా జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 తేదీ వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పేర్కొంటారు. ఈ సీజన్‌కు రాష్ట్రంలో 72.10 సెం.మీ సాధారణ వర్షపాతం. సెప్టెంబర్‌ 7వ తేదీ నాటికే (గురువారం) 74.35 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే వర్షం కురడం గమనార్హం.