Weather Forecast: బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు, మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్
రెండు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం ప్రకటించింది.
Hyd, Sep 6: తెలుగు రాష్ట్రాలను మళ్లీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం ప్రకటించింది.
వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాల వద్ద మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. ఈ అల్పపీడనం బుధవారం దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ దిశలో పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది.
ఈ అల్పపీడనం 24 గంటల్లో పశ్చిమ దిశగా ఛత్తీస్‌గడ్ మీదుగా కదిలే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు తెలంగాణలో 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణవ్యాప్తంగా మరో ఐదు రోజులు కుండపోత.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
మరోవైపు ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ తెలిపింది.
మంగళవారం అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా.. అల్పపీడనం, ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో గంటకు 40–45 కి.మీ, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
తెలంగాణలో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 7వ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ స్పష్టంచేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భదాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది.
భారీ వర్షాలకు వణికిన హైదరాబాద్
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్‌లో పురాతన భవనం కూలిపోయింది.
రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు.
రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్‌పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని అలర్ట్ ప్రకటించింది.
వర్ష సమస్యలపై కాల్ చేయండి
జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ : 040– 21 11 11 11
డయల్ 100 ∙ఈవీడీఎం కంట్రోల్‌రూమ్: 9000113667