Weather Alert in Telugu States: మళ్లీ దూసుకొస్తున్న ముప్పు, 19న బంగాళఖాతంలో అల్ప పీడనం, రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, హెచ్చరించిన వాతావరణ శాఖ

ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర నష్టాలను చవి తెలుగు రాష్ట్రాలపై ( Heavy Rains in Telugu States) మరో ముంపు కాచుకూర్చుని ఉంది. మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (meteorological department) పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా (Low pressure) మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Weather Report in Telugu States (Photo-Twitter/ Minister for IT, Industries, MA & UD, Telangana)

Hyderabad, Oct 17: తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన వర్షాలు ఇప్పట్లో ఆగే సూచనలు కనపడటం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర నష్టాలను చవి తెలుగు రాష్ట్రాలపై ( Heavy Rains in Telugu States) మరో ముంపు కాచుకూర్చుని ఉంది. మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (meteorological department) పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా (Low pressure) మారే అవకాశముందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రం, సమీప ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర మహారాష్ట్ర– దక్షిణ గుజరాత్‌ తీరాలకు దగ్గరలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా, కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర తీరానికి దగ్గరలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది.

ముంపు నుంచి ఇంకా తేరుకోని తెలంగాణ :

భీకర వర్షం ముంచెత్తి నాలుగు రోజులైనా హైదరాబాద్‌ నగరం ఇంకా నీళ్లలోనే నానుతోంది. సుమారు 90కు పైగా కాలనీలు ముంపు నుంచి ఇంకా తేరుకోలేదు. వరద ముంపు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కాలనీల్లోని రోడ్లపై ఇసుక మేటలు వేసింది. ఎటుచూసినా బురద... చెత్తాచెదారం. అడుగుతీసి అడుగు వేయడం నరకంగా మారింది. ఇదంతా ఎత్తిపోయడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎప్పటికి సాధారణ స్థితి నెలకొంటుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ముంపు ప్రాంతాల నుంచి సుమారు పదివేల కుటుంబాలను బయటకు తెచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని అపార్ట్‌మెంట్స్‌ సెల్లార్లు, కాలనీలు వరద ముంపులో ఉండటంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పునరుద్ధరించక సుమారు 222 వీధులు అంధకారంలో కొనసాగుతున్నాయి.

తెలంగాణ వరదల్లో 50 మంది మృతి, 7 లక్షల ఎకరాలకు పైగా పంట మునక, 5 వేల కోట్ల రూపాయల నష్టం జరిగవచ్చనే అంచనా, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ప్రకటించిన సీఎం కేసీఆర్

ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) మొదటి లిఫ్ట్‌ మోటార్లు నీట మునిగాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గం కృష్ణానది తీరంలోని ఎల్లూరు వద్ద కేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం 1, 3వ మోటార్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మూడో మోటార్‌ నీటిని ఎత్తిపోసే పైపులైన్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల సర్జ్‌పూల్‌ పక్కనే గల భూగర్భంలోని ఐదు మోటార్లు నీట మునిగాయి. లీకేజీ ఏర్పడి నీరు మోటార్లకు వస్తుండగా అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు మొదటి మోటార్‌ను, సాయంత్రం 3.40 గంటలకు మూడో మోటార్‌ను ప్రారంభించారు. మూడో మోటార్‌ ఆన్‌చేసిన 10 నిమిషాల తర్వాత ఆ మోటార్‌ కింద ఉన్న బేస్‌మెంట్‌ బ్లాస్ట్‌ కావడం వల్ల నీళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. లిప్ట్‌లోని 45 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చాయి.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 18 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 5,05,817 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 4,23,706 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 308.76 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 588.90 అడుగులుగా నమోదు అయ్యింది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 36 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్‌ ఫ్లో 1.38 లక్షల క్యూసెక్కులు. పూర్తిస్థాయి, ప్రస్తుత నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. పూర్తి స్థాయి, ప్రస్తుత నీటినిల్వ 90 టీఎంసీలకు చేరుకుంది.మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 645.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 642.95 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 15,743 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 12,387 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 3.93 టీఎంసీలుగా కొనసాగుతోంది.

పులిచింతలకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ప్లో ,అవుట్ ప్లో 4,45,380 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 43.93 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను..ప్రస్తుత నీటి మట్టం 173.81 అడుగులకు చేరింది.

సింగూర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. సింగూర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా...ప్రస్తుతం నీటి నిల్వ 28. 279 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు లోకి చేరుతున్న వరద నీటి ఇన్ ఫ్లో 55,571 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు నుండి నీటి ఔట్ ఫ్లో 68,348 క్యూసెక్కులుగా ఉంది. సింగూర్ ప్రాజెక్టు ఎఫ్‌ఆర్ఎల్ 523.600 మీటర్లకు గాను.. ప్రస్తుతం 523.310 మీటర్లుగా నమోదు అయ్యింది.

కృష్ణానది మహోగ్ర రూపం, ఏపీలో భారీగా పంట నష్టం

ఇక విజయవాడలో కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 7.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి వచ్చే వరద 6.92 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. రాత్రి 11 గంటలకు 9 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. కృష్ణా నదీ గర్భంలో... ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం ఉంటున్న భవనంతోపాటు 36 అక్రమ కట్టడాలను వరద చుట్టుముట్టింది. భారీగా వరద వస్తుందనే సమాచారాన్ని అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటున్న వారికి మూడు రోజుల క్రితమే తెలియజేసిన అధికారులు.. తక్షణమే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

కాకినాడలో తీరం దాటిన వాయుగుండం, విజయవాడలో విరిగిన కొండ చరియలు, భారీ వర్షాలకు ఏపీలో ఇద్దరు మృతి, విశాఖలో ఒడ్డుకు కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్‌ మర్చంట్‌ వెసల్‌ నౌక

ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 6 లక్షల 36వేల 921కాగా అవుట్‌ ఫ్లో 6 లక్షల 32 వేల 961 క్యూసెక్కులు. చినలంక,పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం ఎవ్వరూ చేయరాదని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని హెచ్చరించారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఏలేరు వరద తగ్గుముఖం పట్టింది. ఏలేరు రిజర్వాయర్‌లో బుధవారం నుంచి రోజుకు 17 వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు నీటిని విడుదల చేయగా శుక్రవారం ఉదయం 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాలో ఇంకా ముంపు పూర్తిగా వీడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు.

ముంపునకు గురైన లంక ప్రాంతాల ఆక్వా రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు గ్రామాలైన శ్రీపర్రు కాజ్‌వే, జాలిపూడి, గుడివాకలంకలలో వారు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజలు, రైతులు ఆందోళనపడొద్దని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు పాల్గొన్నారు.

భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నీట మునిగి ఏపీ రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 1,07,859 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు జిల్లాల నుంచి అందిన ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47,745 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరి పంట కోతకు వచ్చిన దశలో నీటి పాలు కావడంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. వరదల వల్ల రహదారులు, భవనాల శాఖకు రూ.1,288.96 కోట్లు, జలవనరుల శాఖకు రూ.31.50 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.16.13 కోట్లు, ఇంధన శాఖకు రూ. 0.20 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.38.08 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.0.45 కోట్లు కలిపి మొత్తం రూ.1,375.32 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

భారీ వర్షాలు, వరదల ప్రభావం 171 మండలాలపై పడింది. 902 గ్రామాలు ప్రభావితమయ్యాయి. 28, 927 ఇళ్లు నీట మునిగాయి. 1336 ఇళ్లు కూలిపోయాయి. వివిధ సంఘటనల్లో 14 మంది చనిపోయారు. వరదల నేపథ్యంలో ప్రభుత్వం 123 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు చెందిన 7,853 కుటుంబాలను తరలించింది. 32,823 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయం కల్పించింది.