Weather Forecast: వణికిస్తున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు తప్పని భారీ వర్షాల ముప్పు, నేడు అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం
రాగల 24 గంటల్లో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది.
ఒడిశా కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది.దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి నైరుతి రుతు పవన ద్రోణి కూడా తోడైంది. దీంతో వచ్చే రెండు మూడు రోజుల్లో (Telugu States Next Two days ) ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విదర్భ, గుజరాత్, కొంకణ్ , గోవా, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లోని తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలోని (Andhra Pradesh) అనేక ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు (Very heavy rainfall) పడ్డాయి.మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
తెలంగాణలోని (Telangana) పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే సోమవారం అనేక జిల్లాల్లో వర్షం కురిసింది. అయితే నేడు, రేపు కూడా తెలంగాణలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురియగా.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపైకి నీరుచేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు నేడు, రేపు భాగ్యనగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.