Bypoll Schedule: ఆత్మకూరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల, దేశవ్యాప్తంగా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు, ఆసక్తిరేపుతున్న పంజాబ్, ఢిల్లీ ఫైట్, జూన్ 23న పోలింగ్, 26న కౌంటింగ్
ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 23న ఎన్నికలు నిర్వహించి, 26న ఫలితాలు ప్రకటిస్తారు.
New Delhi, May 25: దేశవ్యాప్తంగా జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ (Bypoll Schedule) విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆరు రాష్ట్రాల్లో.. మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 23న ఎన్నికలు నిర్వహించి, 26న ఫలితాలు ప్రకటిస్తారు. పంజాబ్ (Punjab), త్రిపుర, ఉత్తర ప్రదేశ్ (Uttarapradesh), ఆంధ్ర ప్రదేశ్, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్‌లోని సంగ్రూర్ (Sangroor) లోక్‌సభ స్థానం, ఉత్తర ప్రదేశ్‌లోని ఆజాంఘర్ (Azamgarh), రామ్‌పూర్ (Rampur) లోక్‌సభ స్థానాలతోపాటు, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఝార్ఖండ్‌లోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.
ఏపీకి సంబంధించి ఇటీవల మరణించిన గౌతం రెడ్డి (Mekapati Gowtham reddy)నియోజకవర్గమైన ఆత్మకూరు ఎన్నిక జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలోని రాజేందర్ నగర్ (Delhi) నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇక్కడ్నుంచి ఆమ్ఆద్మీ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన రాఘవ్ చద్దా (Raghav Chadda), రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఆయన నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గంలో బీజేపీకి పట్టు ఉండేది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే, అది ఆమ్ఆద్మీ పార్టీపై ఒత్తిడి పెంచుతుందని బీజేపీ అభిప్రాయం.
అటు ఏపీలో ఆత్మకూరు (Atmakur) ఎన్నికకు సంబంధించి ఆసక్తి నెలకొంది. గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఇప్పటికే వైసీపీ నుంచి విక్రమ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇక్కడి నుంచి పోటీ చేస్తాయా? లేదా? అన్నది ఇంకా తేల్చుకోలేదు. అయితే ఆత్మకూరు స్థానం మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉంది. దానికితోడు గౌతమ్ రెడ్డి మరణంతో సానుభూతి అధికంగా ఉంది.
దేశవ్యాప్తంగా ఉప ఎన్నిక జరిగే స్థానాలు
►ఉత్తర ప్రదేశ్: రెండు ఎంపీ స్థానాలు (రాంపూర్, అజాంఘర్)
►పంజాబ్: ఒక ఎంపీ స్థానం (సంగ్రూర్)
►త్రిపుర: నాలుగు అసెంబ్లీ స్థానాలు (అగర్తల, టౌన్ బోర్డోవళి, సుర్మా, జుబరాజ్‌నగర్)
► ఆంధ్రప్రదేశ్: ఒక అసెంబ్లీ స్థానం (ఆత్మకూరు)
►ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం (రాజిందర్ నగర్)
►జార్ఖండ్: ఒక అసెంబ్లీ స్థానం (మాందార్)