Balasore Triple Train Crash: ఒడిశా రైలు ప్రమాదం, 278కి చేరుకున్న మరణాల సంఖ్య, ఇంకా గుర్తించలేని స్థితిలో 101 మృతదేహాలు
ఒడిశాలో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి చేరిందని రైల్వే అధికారికంగా ప్రకటించింది, మరో ముగ్గురు వ్యక్తులు వారి గాయాలతో మరణించారు.అయితే, రాష్ట్ర ప్రభుత్వం మృతుల సంఖ్యను 275గా అంచనా వేసింది.
భువనేశ్వర్, జూన్ 6: ఒడిశాలో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278కి చేరిందని రైల్వే అధికారికంగా ప్రకటించింది, మరో ముగ్గురు వ్యక్తులు వారి గాయాలతో మరణించారు.అయితే, రాష్ట్ర ప్రభుత్వం మృతుల సంఖ్యను 275గా అంచనా వేసింది. ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) రింకేష్ రే సోమవారం మాట్లాడుతూ జూన్ 2న జరిగిన ప్రమాదంలో 278 మరణించారు. మరో 1,100 మంది గాయపడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరణాలపై అప్ డేట్ చేయలేదని తెలిపారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం 275 మంది మరణించారని, కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి మమతా బెనర్జీ, తమ రాష్ట్రానికి చెందిన 61 మంది మరణించారని, 182 మంది ఇంకా తప్పిపోయారని పేర్కొంటూ గణాంకాలను ప్రశ్నించారు.గాయపడిన 1,100 మందిలో 200 మంది కంటే తక్కువ మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాయ్ చెప్పారు. 278 మృతదేహాలలో 177 మందిని గుర్తించామని, ఇంకా 101 మందిని గుర్తించాల్సి ఉందని, ఈ క్లెయిమ్ చేయని మృతదేహాలను ఆరు వేర్వేరు ఆసుపత్రుల్లో ఉంచామని రింకేష్ రే చెప్పారు.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తప్పిపోయిన వ్యక్తులను గుర్తించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోందని రాయ్ చెప్పారు. మృతదేహాలను శాస్త్రీయ పద్ధతిలో భద్రపరుస్తామని తెలిపారు.మొత్తం 1,100 మంది గాయపడగా వీరిలో దాదాపు 900 మంది చికిత్స తీసుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రింకేశ్ వెల్లడించారు. దాదాపు 200 మంది వివిధ ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఐడెంటిఫై చేస్తున్న మృత దేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నట్టు తెలిపారు.
భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ అమృత్ కులంగే మాట్లాడుతూ..భువనేశ్వర్‌లో ఉంచిన మొత్తం 193 మృతదేహాలలో 80 మృతదేహాలను గుర్తించామని, 55 మృతదేహాలను బంధువులకు అప్పగించామని చెప్పుకొచ్చారు. కాగా, వాతావరణం దృష్ట్యా మృతదేహాలు త్వరితగతిన పాడేపోవడంతో ఒకటి రెండు రోజులు మాత్రమే బాధితుల బంధువుల కోసం వేచి చూస్తామని అధికారులు చెప్పారు.
ఒడిశా బాలాసోర్‌లో ట్రిపుల్ ట్రైన్ ప్రమాదంలో బాధిత కుటుంబాలను గుర్తించడంలో సహాయపడటానికి... ఇండియన్ రైల్వేస్ ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రులలో చేరిన ప్రయాణికుల జాబితాలతో కూడిన మూడు ఆన్‌లైన్ లింక్‌లను సిద్ధం చేసింది. తమవారి ఆచూకీ గురించి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే, వారు తమ వారిని సులభంగా గుర్తించేందుకు ఒడిశా ప్రభుత్వం సహకారంతో భారతీయ రైల్వే సులభతరం చేసే ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది.
ఈ దుర్ఘటనతో ప్రభావితమైన ప్రయాణికుల కుటుంబ సభ్యులు/బంధువులు/స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ క్రింది వివరాల ద్వారా మరణించిన వారి ఫోటోలు, వివిధ ఆసుపత్రుల్లో చేరిన ప్రయాణికుల జాబితాను, గుర్తుతెలియని మృతదేహాల లింక్స్ ను ఉపయోగించి గుర్తించవచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది.
మృతుల ఫోటోలను ఒడిశా ప్రభుత్వంతో కలిసి రైల్వే శాఖ ప్రత్యేక వెబ్ సైట్ లో పొందుపరిచింది.రైల్వే వెబ్ సైట్ ద్వారా తమ వారి ఆచూకీని ఎవరైనా తెలుసుకోవచ్చు. బహనాగ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫోటోల కోసం ఓ లింక్, ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కోసం మరో లింక్, కటక్ లోని ఎస్‌సీబీలో చికిత్స పొందుతున్న వారి ఫోటోల కోసం మరో లింక్ ఇచ్చింది.
ప్రమాదంలో ఇంకా ఎవరి వివరాలైనా తెలియకుంటే 139 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. అలాగే బీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 1929కు కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సేవలు 24X7 అందుబాటులో ఉంటాయి.