Bhopal Hospital Tragedy: ఘోర అగ్ని ప్రమాదం, 4 గురు చిన్నారులు సజీవ దహనం, కమలా నెహ్రూ ఆస్పత్రిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు పరిహారం
రాజధాని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం (Bhopal Hospital Tragedy) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పీడియాట్రిక్స్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ఈ ప్రమాదం (Bhopal hospital fire) చోటుచేసుకుంది
Bhopal, November 9: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. రాజధాని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం (Bhopal Hospital Tragedy) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పీడియాట్రిక్స్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ఈ ప్రమాదం (Bhopal hospital fire) చోటుచేసుకుంది. సంఘటన చోటు చేసుకున్న సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. మూడో అంతస్థులో మంటలు చెలరేగడంతో చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొని పరుగులు తీశారు.
ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 25 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘‘కమలా నెహ్రూ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాను. ఏసీఎస్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మహ్మద్ సులేమాన్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుంది’’ అన్నారు.
ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చామని.. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కొందరు చిన్నారులను రక్షించలేకపోయామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉన్నతస్థాయి విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేశారు.