Vizag Steel Plant Privatisation: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన, ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మోదీ సర్కారు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
Vizag, April 14: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం కొట్టిపారేసింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని పేర్కొంది. RINL ఉపసంహరణ ప్రక్రియపై ఎలాంటి ప్రతిష్టంభన లేదు. RINL పనితీరు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రం వెల్లడించింది.
ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే నిన్న స్పష్టం చేశారు. గురువారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్‌ఐఎన్‌ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్)ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపై దృష్టి సారించామని తెలిపారు. గనుల సమస్యనూ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నింటిపై ఆర్‌ఐఎన్‌ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు.
అయితే గంటల వ్యవధిలోనే మాట మార్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని తాను చెప్పలేదని, మరింత బలోపేతం చేస్తామని మాత్రమే చెప్పానని కేంద్ర మంత్రి ఫగన్‌సింగ్ కులస్తే కొద్ది గంటల వ్యవధిలోనే మాట మార్చారు. గురువారం సాయంత్రం ఆయన నోవోటెల్‌లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉదయం చేసిన ప్రకటనపై మరింత క్లారిటీ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్లాంట్‌ను మరింత బలోపేతం చేస్తామని మాత్రమే మీడియాకు చెప్పానన్నారు. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చేలా సహకరిస్తామన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకొనే అంశం తన చేతుల్లో లేదని, కేంద్ర పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.