Bhupesh Baghel: నాలుగు రోజుల్లో ఎన్నికలు, పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో సీఎం, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు కీలక పరిణామం, ఏకంగా రూ. 508 కోట్లు ముట్టినట్లు ఈడీ ఆరోపణ
మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev App) ప్రమోటర్లు భూపేష్ బఘేల్‌కు 508 కోట్ల రూపాయలు ఇచ్చారని శుక్రవారం ఈడీ పేర్కొంది.
New Delhi, NOV 03: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల (Chhattisgarh Elections) మొదటి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. ఇంతలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) భారీ కుంభకోణంలో ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆయన పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా చేర్చింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev App) ప్రమోటర్లు భూపేష్ బఘేల్‌కు 508 కోట్ల రూపాయలు ఇచ్చారని శుక్రవారం ఈడీ పేర్కొంది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి హస్తమే ఉందని ఈడీ పేర్కొనడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బఘెల్ (Bhupesh Baghel) తరుచూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు ఇలా రావడం గమనార్హం. ఇక ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర మంత్రులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తుండడంపై ఆయన విరుచుకుపడ్డారు. అన్ని ప్రత్యేక విమానాలు దిగడంపై విచారణ జరిపించాలని ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థిస్తున్నట్లు ఆయన గురువారం తెలిపారు. విమానాల్లో వస్తున్న పెట్టెల్లో ఏమి ప్యాక్ చేస్తున్నారని, దాడుల పేరుతో వస్తున్న ఈడీ, సీఆర్పీఎఫ్ వాహనాలను కూడా తనిఖీ చేయాలని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడాన్ని చూసి భాజపా భారీగా డబ్బు తెస్తోందని బాఘేల్ విమర్శించారు.