Brijesh Kalappa Quits Congress: కాంగ్రెస్‌కు మరో సీనియర్ నే రాజీనామా, సిబల్ బాటలోనే రాజీనామా చేసిన సీనియర్ న్యాయవాది, కర్ణాటక కాంగ్రెస్ నేత బ్రిజేష్ కలప్ప, పార్టీ పనులపై ఆసక్తి తగ్గిపోతోందంటూ సోనియాకు లేఖ
ఇన్నాళ్లుగా పార్టీలో కొనసాగుతున్నా అధిష్టానం తమకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ సీనియర్ నేతలు సైతం పార్టీ వీడి వెళ్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత..బ్రిజేశ్ కలప్ప (Brijesh Kalappa) కాంగ్రెస్ పార్టీని వీడారు
Bengaluru,June 02: కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇన్నాళ్లుగా పార్టీలో కొనసాగుతున్నా అధిష్టానం తమకు గుర్తింపు ఇవ్వడం లేదంటూ సీనియర్ నేతలు సైతం పార్టీ వీడి వెళ్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత..బ్రిజేశ్ కలప్ప (Brijesh Kalappa) కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీతో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు బ్రిజేశ్ ప్రకటించారు. కర్ణాటక (Karnataka)రాజకీయాల్లో అధికార బీజేపీ విధానాలను ఎండగడుతూ..పలు టీవీ ఛానెల్స్ లో జరిగే చర్చల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రముఖంగా వినిపించే పేరు బ్రిజేశ్ కలప్ప. వృత్తిపరంగా సుప్రీం కోర్టు లాయర్ (Lawer)అయిన బ్రిజేశ్ కలప్ప (Brijesh Kalappa)..కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ న్యాయ సలహాదారుగా పనిచేశారు. అయితే ఇటీవలి కాలంలో పార్టీలో జరుగుతున్న అంతర్గత విబేధాలు భాదించినట్లు పేర్కొన్నారు.
రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇమడ లేకపోతున్నానని..గతంలో పార్టీ పనులపై ఉన్న ఆసక్తి తగ్గిపోయి..ఉదాసీనత, పనిచేయలేననే భావన ఎక్కువైందని బ్రిజేశ్ (Brijesh Kalappa) వెల్లడించారు. ఈమేరకు మే 30న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి (Sonia Gandhi) రాసిన లేఖలో వివరించారు. గత 25 ఏళ్లుగా కాంగ్రెస్ సేవలో ఉన్న బ్రిజేశ్..2013 నుంచి ఆపార్టీకి సంబందించిన చర్చా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
“2014 మరియు 2019 పరాజయాల తర్వాత పార్టీకి అత్యంత దారుణమైన సమయాల్లో కూడా, నాలో ఎప్పుడూ ఉత్సాహం, శక్తి లోపించలేదు. కానీ, ఇటీవలి కాలంలో రాజకీయాలపై ఆసక్తి కోల్పోయాను, నా స్వంత ప్రదర్శన నీరసంగా మరియు పనికిరానిదిగా ఉంది, ”అని కలప్ప తన లేఖలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కలప్ప రాజీనామా చేయడంపై ఆపార్టీ నేతలు స్పందిస్తూ..కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అధిష్టానం కలప్పకు టికెట్ ఇవ్వలేదని..అదే సమయంలో ఇటీవలి రాజ్యసభ సభ్యుల్లోనూ తన పేరు లేకపోవడంతోనే కలప్ప పార్టీని వీడినట్టు పేర్కొన్నారు.