Covid in India: వికటించిన వ్యాక్సిన్, శ్రీకాకుళం జిల్లా పలాస వాలంటీర్ మృతి, మరికొందరిలో దుష్ప్రభావాలు, దేశంలో తాజాగా 11,831 మందికి కరోనా నిర్ధారణ, ఏపీలో 73 మందికి పాజిటివ్

వ్యాక్సిన్‌ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

New Delhi, Feb 8: దేశంలో గత 24 గంటల్లో 11,831 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,904 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (Coronavirus Updates) 1,08,38,194 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 84 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,080 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,34,505 మంది కోలుకున్నారు. 1,48,609 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 58,12,362 మందికి వ్యాక్సిన్ వేశారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,980 కరోనా పరీక్షలు నిర్వహించగా 73 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని తేలింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, కడప జిల్లాలో 2 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,423 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,261 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,003కి తగ్గింది. కరోనా మృతుల సంఖ్య 7,159గా ఉంది.

ఇండియాలో మరో ఏడు వ్యాక్సిన్లు, సౌతాఫ్రికా కరోనాపై పనిచేయని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్‌ (Corona Vaccination) తీసుకున్న శ్రీకాకుళం జిల్లా పలాస వలంటీర్‌ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. వ్యాక్సిన్‌ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. టీకా తీసుకున్న తరువాత ఆమెకు జ్వరం, తలనొప్పి వచ్చాయి. ఆమెతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న మరికొంత మందిలో కూడా దుష్ప్రభావాలు కనిపించాయి. వారిని చికిత్స నిమిత్తం తరలించినా, లలిత పరిస్థితి విషమించింది. దీంతో 28 ఏళ్ల లలిత ఆదివారం నాడు కన్నుమూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, రిపోర్టు వచ్చిన తరువాతనే ఆమె మృతికి అసలు కారణం తెలుస్తుందని పలాస తహసీల్దారు పేర్కొన్నారు.

మళ్లీ కరోనా కన్నా డేంజరస్ వైరస్, భారీ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం, క్యాండిడా ఆరిస్‌ వస్తే బతికే అవకాశాలు తక్కువంటున్న శాస్త్రవేత్తలు, మానవాళి మళ్లీ సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు

పలాస మండలం రెంటికోటకు చెందిన 8 మంది వలంటీర్లతో పాటు వీఆర్వో ప్రసాద్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరందరిలోనూ స్వల్ప జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అందరూ ఇంట్లోనే ఉండి టాబ్లెట్లు వేసుకున్నారు. అయితే, లలిత పరిస్థితి మాత్రం విషమించిందని తహసీల్దారు మధుసూదనరావు తెలిపారు. లలిత మృతితో తీవ్ర ఆందోళనకు గురైన ఇతర వలంటీర్లను, వీఆర్వోను పలాస పీహచ్ కి తరలించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు, లలిత కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 2 లక్షలు అందిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తన బిడ్డకు ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేవని, టీకా తీసుకున్న తరువాత జ్వరం రాగా, పారాసిటమాల్ వేసుకోవాలని మెడికల్ సిబ్బంది చెప్పారని లలిత తల్లి పార్వతి పేర్కొంది. టీకా దుష్ప్రభావంతోనే తాము బిడ్డను కోల్పోయామని బోరున విలపించింది.