Covid Vaccine For Children: తరుముకొస్తున్న కరోనా థర్డ్ వేవ్, ఆగస్టు నుంచి చిన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు, బీజేపీ ఎంపీల సమావేశంలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ
ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు (Covid Vaccine For Children) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ (Health Minister Mansukh Mandaviya) వెల్లడించారు.
New Delhi, July 27: కరోనా థర్డ్ వేవ్ తరుముకొస్తున్న తరుణంలో కేంద్రం నుంచి శుభవార్త బయటకు వచ్చింది. ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు (Covid Vaccine For Children) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ (Health Minister Mansukh Mandaviya) వెల్లడించారు. మంగళవారం ఉదయం పార్లమెంటులో జరిగిన బీజేపీ ఎంపీల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. ఈ వార్తను ఎన్టీ టీవీ తన కథనంలో తెలిపింది.
ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తమ పార్టీ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రాజ్యసభలోనూ పిల్లల వ్యాక్సినేషన్ (Covid-19 Vaccination for kids) గురించి ఓ సభ్యుడు ప్రశ్నించారు. ఆ సమయంలో మంత్రి సమాధానం ఇవ్వబోయారు. కానీ విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఆరోగ్య మంత్రి ఇచ్చిన సమాధానం సరిగా వినపడలేదు. మరోవైపు 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జైడస్ వ్యాక్సిన్ సెప్టెంబరు నాటికి ప్రారంభం కానుందని వ్యాక్సిన్లపై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ అధినేత డాక్టర్ ఎన్‌కె అరోరా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సమయంలో పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. జైడస్ ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకోగా అత్యవసర వినియోగ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. కోవాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబరులో వెల్లడికావచ్చని, దీని ప్రకారం సెప్టెంబరు నాటికి వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు. కాగా దేశంలో ఇప్పటివరకు 44 కోట్లకు పైగా వ్యాక్సిన్లను స్వీకరించగా, ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి అందరికీ టీకాలు వేయాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండియాలో రెండు కోవిడ్ టీకాలను పిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. జైడస్ క్యాడిలా ఇచ్చిన రిపోర్ట్‌ను డ్రగ్ రెగ్యులేటర్ పరిశీలిస్తున్నది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలపై జైడస్ కోవిడ్ టీకా ట్రయల్స్ నిర్వహించింది. ఇక భారత్ బయోటెక్ సంస్థ కూడా 2 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలపై రెండవ, మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు టీకాల ఫలితాల ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి పవార్ తెలిపారు.