JN1 Sub Variant Cases in India: దేశంలో 63కి పెరిగిన కొత్త సబ్-వేరియంట్ జేఎన్‌.1 కేసులు, నాలుగో వ్యాక్సిన్ అవసరంపై నిపుణులు ఏమంటున్నారంటే..

కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి

Representational Image (File Photo)

New Delhi, Dec 25: ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్‌లోని కొత్త సబ్-వేరియంట్ జేఎన్‌.1 (JN1 Sub Variant Cases in India) భారత దేశంలో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 63కు ( 63 Cases of Sub-Variant JN.1 Detected)చేరాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ వేరియంట్‌ బారినపడ్డారు. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు(4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. ఇక దేశంలో కరోనా(Covid-19)కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే క్రియాశీల కేసుల సంఖ్య 4,054కి చేరింది.

దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు, మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్‌ ముండేకు కోవిడ్, కొత్తగా 656 కేసులు నమోదు

జేఎన్‌.1 వేరియంట్‌ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ జేఎన్‌.1 వేరియంట్‌కు సంబంధించి తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

ఈ ఉపరకం కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్‌లతోపాటు భారత్‌లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది.

కోవిడ్ సార్‌కోవ్ 2తో చాలా డేంజర్ అంటున్న వైద్యులు, ఇది సోకడంతో అమెరికాలో మాటను కోల్పోయిన బాలిక, వైద్యులు ఏమంటున్నారంటే..

ప్రస్తుత శీతాకాల సీజన్‌ పరిగణనలోకి తీసుకొని కొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.. రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. జేఎన్‌.1 గురించి ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

దీనికి ప్రస్తుతం బూస్టర్ డోసు లేదా నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా సార్స్‌- కోవ్‌-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ.. కొత్త సబ్‌-వేరియంట్‌లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే, ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోని పక్షంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని చెప్పారు.

ఓమిక్రాన్‌లోని ఈ కొత్త సబ్-వేరియంట్‌కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్‌ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్‌.1 సబ్‌వేరియంట్ లక్షణాలు.. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు అని తెలిపారు. ఇవి సాధారణంగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయన్నారు.

కాగా కోవిడ్‌-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటాలోని వివరాల ప్రకారం దేశంలో ఆదివారం ​​​​కొత్తగా 656 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కి చేరుకుంది.