COVID-19 Vaccination: వ్యాక్సిన్ ధరపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తాం, మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌, దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా ప్రక్రియ, మీడియాతో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

ఇకపై మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ (Coronavirus Vaccine) వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, February 24: ఇప్పటిదాకా కరోనా వారియర్స్‌గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవకులుగా ఉన్న అధికార యంత్రాంగానికి ఇన్నాళ్లు వ్యాక్సినేషన్‌ (COVID-19 Vaccination) వేసిన తెలిసిందే. ఇకపై మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ (Coronavirus Vaccine) వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు రెండు అంతకన్నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైవయస్కులకు కూడా వ్యాక్సిన్‌ వేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ వేస్తామని మంత్రి వివరించారు. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్నట్లు, ప్రైవేటు కేంద్రాల్లో వేసుకోవాలని భావించేవారు రుసుము చెల్లించాలని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలనే విషయమై రెండు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తుందని చెప్పారు. ఈ రెండో దశలో దాదాపు 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ప్రకాశ్‌ వెల్లడించారు.

ముంచుకొస్తున్న కరోనా పెనుముప్పు, తెలంగాణలో కొత్త కరోనా వైరస్, మహారాష్ట్ర, కేరళలో రెండు రకాల వైరస్‌లు, దేశంలో తాజాగా 13,742 కొత్త కేసులు, కరోనాతో 2 కోట్ల ఏళ్ల జీవితకాలం నష్టం సంభవించిందని తెలిపిన ఓ అధ్యయనం

60 ఏళ్ల పైబడిన వారు 10 కోట్ల మంది ఉంటారని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. మొదటి దశలో 1,07,67,000 మందికి వ్యాక్సినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత వ్యాక్సిన్‌ అత్యధిక మందికి వేసిన దేశంగా భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అత్యవసర వినియోగానికి భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాగ్జిన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన కోవిషీల్డ్‌ వినియోగిస్తున్న విషయం తెలిసిందే.