Corona Vaccine Update: వచ్చే ఏడాదిలోనే కరోనా వ్యాక్సిన్, స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్, ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం
టీకా పంపిణీ కోసం నిపుణుల బృందాలు ప్రణాళికలు రచిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం నాడు జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం సందర్భంగా మంత్రి హర్ష వర్ధన్ (Dr Harsh Vardhan) ఈ విషయాలను వెల్లడించారు.
New Delhi, October 12: భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు (Corona Vaccine Update) అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ పేర్కొన్నారు. టీకా పంపిణీ కోసం నిపుణుల బృందాలు ప్రణాళికలు రచిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం నాడు జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం సందర్భంగా మంత్రి హర్ష వర్ధన్ (Dr Harsh Vardhan) ఈ విషయాలను వెల్లడించారు.
ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ (COVID-19 Vaccine Expected in World) ప్రపంచం ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రుల బృందం భేటీలో మంత్రి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటు, పంపిణీ అంశాలపై ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది చివరి నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధమవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ పేర్కొన్న విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా 40 కరోనా వైరస్ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా వాటిలో 10 వ్యాక్సిన్‌లు కీలక మూడవ దశలో ఉన్నాయని వీటి భద్రత, సామర్ధ్యం మనకు వెల్లడి కావాల్సి ఉందని ఆమె అన్నారు. ఈ వ్యాక్సిన్లు కీలక దశలను దాటుకుని తగినంత డేటాతో రెగ్యులేటర్ల అనుమతి పొందే ప్రక్రియ ముగియాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఈ అంశాల ఆధారంగా చూస్తే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
టీకాలను ముందుగా ఎవరికి ఇవ్వాలి, టీకాలను భద్రపరిచేందుకు కోల్ట్ చైన్ ఫెసిలిటీలను బలోపేతం చేస్తున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు. భారత జనాభాను దృష్టిలో పెట్టుకుంటే, ఒక వ్యాక్సిన్ కంపెనీ ఈ జనాభా మొత్తానికి టీకాలను సరఫరా చేయలేదని ఆయన అన్నారు.