Covishield Vaccine: వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తోంది, పుణే నుంచి వివిధ రాష్ట్రాలకు బయలుదేరిన కొవిషీల్డ్ వ్యాక్సిన్, ఈ నెల 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం
కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ (Serum Institute) తొలి విడత టీకా సరఫరాను పుణెలోని తయారీ కేంద్రం నుంచి మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పంపించింది.
Pune, January 12: ఈనెల 16న దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలి కన్‌సైన్‌మెంట్ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను (Covishield Vaccine) పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి మంగళవారం ఉదయం మూడు ట్రక్కుల్లో విమానాశ్రయానికి తరలించారు. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ (Serum Institute) తొలి విడత టీకా సరఫరాను పుణెలోని తయారీ కేంద్రం నుంచి మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పంపించింది.
కట్టుదిట్టమైన భద్రత నడుమ వీటిని పుణె విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉదయం 10 గంటలకల్లా సరఫరా చేయనున్నారు. రవాణా కోసం జీపీఎస్ సౌకర్యమున్న ట్రక్కులను వినియోగించారు. మొత్తం 478 బాక్సుల్లో టీకాలను భద్రంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బాక్సు బరువు దాదాపు 32 కిలోలు ఉంటుందని సమాచారం.
తొలి విడత డోసులు పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్, హైదరాబాద్, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్, భువనేశ్వర్‌కు చేరనున్నట్లు సమాచారం. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి కార్గో విమానం హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్‌కు రానుండగా.. మరొకటి కోల్‌కతా, గువాహటికి వెళ్లనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.
3 Trucks carrying Covishield Vaccine Reach Pune Airport From Serum Institute, Watch Video
ముంబయికి రోడ్డుమార్గం ద్వారా వ్యాక్సిన్ డోసులను (Coronavirus Vaccine) సరఫరా చేయనున్నట్లు సమాచారం. స్పైస్‌జెట్‌కు చెందిన విమానాల్ని టీకా రవాణా కోసం వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. మొత్తంగా ఎనిమిది విమానాల్లో వ్యాక్సిన్ చేరవేస్తారని, ఇందులో రెండు కార్గో విమానాలు, తక్కినవి రెగ్యులర్ కమర్షియల్ విమానాలు ఉంటాయని లాజిస్టిక్స్ టీమ్ ఎస్‌బీ లాజిస్టిక్స్‌కు చెందిన సందీప్ భోసలే తెలిపారు. 10 గంటల కల్లా అన్ని వ్యాక్సిన్లు డిస్పాచ్ అవతాయని చెప్పారు. తొలి దశలో మూడు కోట్ల హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
ఇండియాలో 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్, ఈనెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభం
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత.. 50 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్య సమస్యలున్న 50 ఏళ్లలోపు వారికి టీకా వేస్తారు. దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు భారత్ బయోటెక్ కూడా తన టీకాలను నేరుగా 12 రాష్ట్రాలకు సరఫరా చేయనుంది. ఈ ప్రక్రియ మంగళవారం ప్రారంభమై, రెండు రోజుల్లో ముగియనుందని సంబంధిత అధికారులు తెలిపారు.
రాబోయే రోజుల్లో మరో ఐదు కంటైనర్లు గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానాకు రవాణా చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ రవాణా కోసం ప్రత్యేకంగా ట్రక్కులు అందుబాటులో ఉంచారు.మూడు కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేసేందుకు సీరం ఇనిస్టిట్యూట్ నుంచి 1.1కోట్లకుపైగా వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. కోవిషీల్డ్ ప్రతి మోతాదుకు రూ.210 ఖర్చవుతోంది. ఏప్రిల్ నాటికి 4.5కోట్ల డోసులు కొనుగోలు చేయనుంది. అలాగే హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు కూడా ప్రభుత్వం టీకాలకు ఆర్డర్ ఇచ్చింది.