Cyclone Yaas: మరి కొద్ది గంటలే..బాలాసోర్‌ దగ్గర తీరం దాటనున్న యాస్ తుఫాన్, తీరం దాటే సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్రమత్తమైన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఏపీ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక

బుధవారం మధ్యాహ్నం బాలాసోర్‌కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భువనేశ్వర్‌లోని ఐఎండీ సీనియర్‌ శాస్త్రవేత్త ఉమాశంకర్‌ దాస్‌ పేర్కొన్నారు.

Cyclone Yaas

New Delhi, May 26: మూడు రాష్ట్రాలను వణికిస్తున్న యాస్‌ తుఫాను (Cyclone Yaas) తీరం దిశగా కదులుతున్నది. బుధవారం మధ్యాహ్నం బాలాసోర్‌కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భువనేశ్వర్‌లోని ఐఎండీ సీనియర్‌ శాస్త్రవేత్త ఉమాశంకర్‌ దాస్‌ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ధామ్రాకు 40 కిలోమీటర్లు, దిఘాకు 90 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.

తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌లో బుధవారం ఉదయం నుంచి తీవ్రమైన గాలులతో కూడిన వర్షం (Cyclone Yaas to Make Landfall ) కురుస్తున్నది. ఒడిశాలోని తీర ప్రాంతాల్లో ప్రజలు పరిపాలనకు సహకరించాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ కోరారు. మంగళవారం మధ్యాహ్నానికే పశ్చిమ, తూర్పు, వాయువ్య బంగాళాఖాతంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు హోంశాఖ సహాయమంత్రి డీఎస్‌ మిశ్రాను బాలాసోర్‌కు పంపించారు. యాస్‌ తీరం దాటే సమయంలో 2 నుంచి 4.5 మీటర్ల ఎత్తన ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. పూరిళ్లు పూర్తిగా ధ్వంసమవుతాయని, పక్కా ఇళ్లకూ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఒడిశాలోని చాందీపూర్‌లో డీఆర్‌డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ)కు చెందిన ఐటీఆర్‌(ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌)తోపాటు, అబ్దుల్‌ కలాం దీవిలోనూ తుఫాను ప్రభావం చూపనున్నందున అక్కడ సురక్షిత చర్యలను డీఆర్‌డీవో చేపట్టింది.

యాస్ తుఫాన్ ఉగ్రరూపాన్ని తెలిపే వీడియో, ఒడిశాలోని పారాదీప్ వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అల‌లు, చెవుల‌కు చిల్లులు ప‌డేలా స‌ముద్ర‌పు హోరు, ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ స‌రిహ‌ద్దుల్లో ఒడిశా తీరాన్ని తాకనున్న యాస్

చాందీపూర్‌లో మూడు క్షిపణి ప్రయోగ వ్యవస్థలు(లాంచ్‌ ప్యాడ్‌లు), అబ్దుల్‌ కలాం దీవిలో ఓ ప్రయోగ భవనం, రెండు మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌లు, బ్లాక్‌ హౌస్‌లు ఉన్నాయి. అయితే, గంటకు 400 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులనూ తట్టుకునేలా కంట్రోల్‌ రూమ్‌, బ్లాక్‌ హౌస్‌లను నిర్మించారు. డీఆర్‌డీవో సన్నద్ధత మార్గదర్శకాల మేరకు అన్ని రక్షణ ఏర్పాట్లు చేశామని ఐటీఆర్‌ అధికార ప్రతినిధి మిలాన్‌ కుమార్‌ పాల్‌ చెప్పారు.

తుఫాను నేపథ్యంలో బెంగాల్‌లో 11.5లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. తుఫాను పరిస్థితిని సమీక్షించేందుకు 26న సచివాయం నబన్నాలో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇదిలా ఉండగా.. మంగళవారం భారీ గాలులతో కురుస్తున్న వర్షానికి (Cyclone Yaas Landfall) హుగ్లీ, ఉత్తర 24 పగరణాలు జిల్లాల్లో 80 ఇండ్లు దెబ్బతిన్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే సైతం అప్రమత్తమై 38 ట్రయిన్లను రద్దు చేసింది. తుఫానును ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సహాయక చర్యలను వేగవంతం చేసింది. రెండు నేవీ డైవింగ్‌ బృందాలు, అవసరమైన సామగ్రి, పడవలతో ప్రత్యేక సిబ్బందితో కూడిన ఐదు వరద సహాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఏపీ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక

యాస్‌’పై వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశింశించారు. అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై పెను ప్రభావం ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను గమరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

దూసుకొస్తున్న యాస్ తుఫాన్, అల్లకల్లోలంగా బంగాళాఖాతం తీర ప్రాంతాలు, రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్న యాస్, ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసిన ఐఎండీ

యాస్‌ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మంగళవారం అక్కడక్కడ వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో రెండవ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 45-55కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు,మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఒడిశాకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ఒడిశాకు గతంలో ఎన్నడూలేనంతగా అత్యధిక సంఖ్యలో బృందాలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ పంపించింది. బంగాళాఖాతంలో తుఫానుల వల్ల ప్రభావితమయ్యే ఒడిశా, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, ఏపీ, తమిళనాడు రాష్ర్టాలతోపాటు అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో వినియోగించేందుకు 112 బృందాలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కేటాయించింది. అయితే, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇప్పుడు ఒడిశాకు 52, బెంగాల్‌కు 45 బృందాలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ పంపింది.

మిగిలిన 15 బృందాలను మిగతా మూడు రాష్ర్టాలు, అండమాన్‌, నికోబార్‌ దీవులకు పంపినట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 50 బృందాలనూ అవసరాన్ని బట్టి హెలికాప్టర్లలో ఈ రెండు రాష్ర్టాలకు రప్పించేందుకు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఒక్కో బృందంలో 47 మంది ఉంటారు. కూలిన చెట్లు, స్తంభాలు తొలగించేందుకు పరికరాలు, కమ్యూనికేషన్‌ గ్యాడ్జెట్లు, గాలి పడవలు, ప్రాథమిక వైద్య పరికరాలూ బృందం వద్ద ఉంటాయి.

పలు రైళ్లు రద్దు

ఆగ్నేయ రైల్వే ఇప్పటికే అనేక రైళ్లను బుధవారం వరకు రద్దు చేసింది. అలాగే, యాస్‌ తుఫాను కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రకటించింది. తిరుపతి-కోల్హాపూర్‌(సాహుమహారాజ్‌ టెర్మినస్‌), నర్సాపూర్‌-ధర్మవరం రైళ్లను ఈ నెల 26 నుంచి 31 వరకు, కోల్హాపూర్‌(సాహుమహారాజ్‌ టెర్మిన్‌స)-తిరుపతి రైలును ఈ నెల 28 నుంచి జూన్‌ 2 వరకు, ధర్మవరం-తిరుపతి రైలును ఈ నెల 27 నుంచి జూన్‌ 1 వరకు రద్దు చేస్తున్నామని తెలిపింది. ఈ నెల 28న యశ్వంత్‌పూర్‌-గౌహతి, చెన్నై-భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రె్‌సలు, 27న టాటానగర్‌-ఎర్నాకుళం, 30న పూరి-చెన్నై, ఎర్నాకుళం-టాటానగర్‌ ఎక్స్‌ప్రె్‌సలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.