Delhi Demolition Drive: ఇళ్లు కట్టిస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు బుల్డోజర్లతో కూల్చేస్తోంది, 63 లక్షల మందిని రోడ్డు మీదకు తీసుకువస్తోందని మండిపడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
New Delhi, May 16: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) బీజేపీ(BJP)పై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమ నిర్మాణాల పేరుతో బీజేపీ బుల్డోజర్లతో ప్రజల ఇండ్లు, దుకాణాలను కూల్చివేయడం సరైంది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఇదే అతి పెద్ద (Delhi Demolition Drive) ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో కాషాయ పార్టీ బుల్డోజర్లు ఇదే తరహాలో తిరిగితే నగరంలో 63 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) కూల్చివేతలను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. కూల్చివేతల్లో గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి.. 80 శాతం ఢిల్లీ కూల్చివేతల పరిధిలోకి వస్తుంది. రెండవది.. ప్రజలు తమ ఆస్తుల పత్రాలను చూపిస్తున్నా కనికరం లేకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలోని చిన్నచిన్న కాలనీలు, మురికివాడలను కూల్చివేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్ట్ స్టే, తక్షణమే కూల్చివేతలను ఆపాలని ఆదేశాలు
ఎన్నికల్లో గెలిచేందుకు ఇళ్లు కట్టిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు జనాల ఆవాసాలను కూల్చివేస్తోందని విమర్శలు గుప్పించారు. 15 ఏండ్ల పాటు ఎంసీడీ పాలనా పగ్గాలు చేపట్టిన కాషాయ పార్టీయే అక్రమ నిర్మాణాలకు బాధ్యత వహించాలని కేజ్రీవాల్ అన్నారు.