Delhi CM Arvind Kejriwal: జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈడీ కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్
బెయిల్ పొందేందుకు చట్టపరంగా తనకు అర్హత ఉందని కేజ్రీవాల్ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఇదిలాఉంటే.. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సీఎంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి జల మంత్రిత్వ శాఖకు సంబంధించిన తొలి ఉత్తర్వులు (First Order) జారీ చేశారు.
New Delhi, March 24: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను (Kejriwal) ఈనెల 21న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీతోసహా దేశంలోని పలు నగరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు, కార్యకర్తలు నిరసనలు కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ ను (Delhi Cm Arvind Kejriwal) ఈడీ అరెస్టు చేసిన మరుసటి రోజే రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. విచారణ అనంతరం ఈనెల 28వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి పంపింది. అయితే, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సుముఖంగా లేరు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుతానని తెలిపారు.
అంతేకాక.. ఆపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలుసైతం కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతాడని తెలిపారు. ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ ను వెంటనే విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కోర్టు కేజ్రీవాల్ పిటిషన్ ను మార్చి 27న విచారించనుంది. ఈ పిటీషన్ లో.. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. బెయిల్ పొందేందుకు చట్టపరంగా తనకు అర్హత ఉందని కేజ్రీవాల్ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఇదిలాఉంటే.. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సీఎంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి జల మంత్రిత్వ శాఖకు సంబంధించిన తొలి ఉత్తర్వులు (First Order) జారీ చేశారు. తన ఉత్తర్వులను జల మంత్రికి నోట్ ద్వారా జారీ చేశారు.
కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదా అనే చర్చ సాగుతోంది. ఆయన ఇంకా దోషిగా తేలనందున జైలు నుంచి పాలన చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆప్ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ మంత్రి అతిశీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తారని చెప్పారు. మరోవైపు రెండోరోజు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కొనసాగుతుంది. తొలిరోజు ఈడీ విచారణకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. సీసీ టీవీ పర్యవేక్షణలో కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కే్జ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.