Delta Plus Still 'Variant of Interest': చాపకింద నీరులా డెల్టా ప్ల‌స్ వేరియంట్, దేశంలో 40కిపైగా కేసులు గుర్తింపు, ధర్డ్ వేవ్‌కి దారి తీసే అవకాశం ఉందంటున్న నిపుణులు, లక్షణాలు ఎలా ఉంటాయి, వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా ఓ సారి చూద్దాం

మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఆ రాష్ట్రాల‌కు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది.

Delta Plus Still 'Variant of Interest' Representative Image

New Delhi, June 23: దేశంలో ఆందోళనకరంగా మారిన వేరియంట్‌గా గుర్తించిన డెల్టా ప్ల‌స్ కేసులు (Delta Plus Variant) దేశంలో 40కిపైగా ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఆ రాష్ట్రాల‌కు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. అయితే ఈ రాష్ట్రాల‌కే ఈ వేరియంట్ (Delta Plus Still 'Variant of Interest) ప‌రిమితం కాలేద‌ని, ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మ‌హారాష్ట్ర‌లో 21, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆరు, కేర‌ళ‌, త‌మిళ‌నాడుల్లో మూడు, క‌ర్ణాట‌క‌లో 2, పంజాబ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్ముక‌శ్మీర్‌ల‌లో ఒక్కో కేసు ఉన్న‌ట్లు ఆ వ‌ర్గాలు తెలిపాయి.

డెల్లా ప్ల‌స్ వేరియంట్ కేసులు ప్ర‌స్తుతానికి త‌క్కువ‌గానే ఉన్నా.. దేశంలో ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్లు ఎత్తేస్తుండ‌టంతో ఈ కేసులు ఎక్కువయ్యే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. డెల్టా ప్ల‌స్ కేసులు మ‌హారాష్ట్ర‌లోని ర‌త్న‌గిరి, జ‌ల్‌గావ్‌.. కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్‌, ప‌త‌న‌మితిట్ట‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌, శివ్‌పురిల‌లో ఉన్నాయి. త‌మ రాష్ట్రంలో ఈ కేసులు వ‌చ్చిన ప్రాంతాల్లోని వ్య‌క్తులు ఎక్క‌డెక్క‌డ తిరిగారు, వాళ్ల వ్యాక్సినేష‌న్ ప‌రిస్థితి ఏంట‌న్న‌దానిపై వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు మ‌హారాష్ట్ర తెలిపింది.

కరోనా కన్నా ప్రమాదకర వైరస్, మహారాష్ట్రలో మహాబలేశ్వర్ గుహలో గబ్బిలాల్లో నిఫా వైరస్, మనుషులకు సోకితే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం వైద్య నిపుణుల హెచ్చరిక, నిఫా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి

డెల్టా వేరియంట్‌లాగే ఇది కూడా చాలా వేగంగా వ్యాపించే వేరియంట్‌. ఇప్ప‌టికే 9 దేశాల‌కు ఇది పాకిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గ‌తంలో డెల్టా వేరియంట్ 80 దేశాల‌కు పాకిన విష‌యం తెలిసిందే. డెల్టా ప్ల‌స్ వేరియంట్ వ్యాక్సిన్ల‌నూ బోల్తా కొట్టిస్తున్నాయ‌ని, ప్ర‌స్తుత చికిత్స‌కూ అంద‌డం లేద‌న్న వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా ప్రకటించింది. అంటే ఆందోళ‌న‌క‌ర వేరియంట్ అని అర్థం. ఈ కేసుల న‌మోదుతో డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు న‌మోదైన‌ దేశాల జాబితాలో భార‌త్‌ చేరింది.

గుడ్ న్యూస్..భారత్‌లో 29 కోట్లు దాటిన వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య, రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, తాజాగా 50,848 మందికి కరోనా, దేశంలో ప్రస్తుతం 6,43,194 కోవిడ్ పాజిటివ్‌ కేసులు

ప్రస్తుతం దేశంలో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనే డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ద‌ని భారతీయ సార్స్ కోవ్‌-2 జినోమిక్స్ కన్సార్టియం నివేదించిందని కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, చైనా, రష్యాల‌లో క‌నిపించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ భారతదేశంతో సహా ప్రపంచంలోని 80 దేశాలలో డెల్టా వేరియంట్ క‌నిపించింద‌న్నారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలోని రత్నగిరి, జల్గావ్, కేరళ, మధ్యప్ర‌దేశ్‌ల‌లో న‌మోద‌య్యాయి. ఈ రాష్ట్రంలో ఆరోగ్య‌విభాగాలు అప్ర‌మ‌త్తం కావాల‌ని సూచించారు.

సెకండ్ వేవ్ ఉధృతికి కారణమైన డెల్టా వేరియంట్ నుంచి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుకురావడంతో ఈ వైరస్ థర్డ్ వేవ్‌కు దారితీయవచ్చునన్న అనుమానాలు,ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ ని ఓ సారి పరిశీలిస్తే.. భారత్‌లో గతేడాది గుర్తించిన కోవిడ్ వేరియంట్‌ B.1.617.2ని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసింది. ఈ ఆందోళనకర వేరియంటే డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది.

డెల్టా ప్లస్ లేదా AY.01గా చెబుతున్న ఈ వైరస్ కేసులు దేశంలోని మూడు రాష్ట్రాల్లో బయటపడ్డాయి. డెల్టా వేరియంట్ కంటే దీని వ్యాప్తి రెట్టింపు ఉండొచ్చునని... రోగ నిరోధక శక్తిని సైతం ఇది తట్టుకోగలదేమోనని ఆరోగ్య నిపుణులు అంచనాలతో థర్డ్ వేవ్‌ ముప్పు దీని రూపంలోనే పొంచి ఉందా అన్న చర్చ జరుగుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌లోని స్పైక్ ప్రోటీన్‌ K417N అనే మ్యుటేషన్‌ను కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన మొదటి సీక్వెన్స్‌ను మార్చి,2021లో యూరోప్‌లో గుర్తించారు. తాజాగా దేశంలోని మూడు రాష్ట్రాల్లో 22 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.

కాగా COVID-19ని నయం చేసేందుకు చేసే మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ట్రీట్‌మెంట్‌లకు సైతం ఇది లొంగకపోవచ్చునని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ట్రీట్‌మెంట్‌లో కెసిరివిమాబ్, ఇమ్ డెవిమాబ్ అనే రెండు మందుల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఇటీవలే భారత్ ఈ ట్రీట్‌మెంట్‌కు అనుమతినిచ్చింది.

డెల్టా ప్లస్ వేరియంట్... లక్షణాలు...

సాధారణంగా కోవిడ్ సోకినవారిలో జ్వరం,దగ్గు,నీరసం,ఒళ్లు నొప్పులు,చర్మంపై దద్దుర్లు,గొంతు నొప్పి,వాసన కోల్పోవడం,డయేరియా,తలనొప్పి,ఛాతినొప్పి,శ్వాసకోశ సమస్యలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. డెల్టా వేరియంట్‌లో కోవిడ్ లక్షణాలతో పాటు కడుపునొప్పి,వాంతులు,కీళ్ల నొప్పులు,వికారం,వినికిడి లోపం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

డెల్టా ప్లస్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డా.స్కాట్ గాట్లిబ్ దీనిపై స్పందిస్తూ... వ్యాక్సిన్లు దీనిపై ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉందన్నారు. mRNA వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై 88శాతం సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని... వైరల్ వెక్టార్ వ్యాక్సిన్లు జాన్సన్ అండ్ జాన్సన్,అస్ట్రాజెనెకా 66శాతం సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అన్నారు.

మోడెర్నా,ఫైజర్,బయోఎన్‌టెక్ వ్యాక్సిన్లను mRNA టెక్నాలజీతో అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఉపయోగిస్తున్న కోవాగ్జిన్,కోవీషీల్డ్ రెండూ డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తాయని ఎయిమ్స్ వెల్లడించింది.ఇప్పటికైతే డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి భారత్‌లో తక్కువగానే ఉన్నందు వల్ల అంతగా ఆందోళన చెందనక్కర్లేదన్న అభిప్రాయాలు సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతంలో డెల్టా వేరియంట్ కేసులు కూడా తక్కువ సంఖ్యలోనే నమోదై... ఆ తర్వాత సెకండ్ వేవ్ ఉధృతికి దారితీసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ వేరియంట్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను త్వరితగతిన గుర్తించడం.. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయడమే దీనికి పరిష్కారమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకె పాల్ పేర్కొన్నారు.